Wednesday, March 12, 2008

త్వరగా తేల్చండి: కృపాకర్

న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: గ్రూప్-1, గ్రూప్-2 ఖాళీలు, ఉపాధ్యాయులు, పోలీసులు తదితర వేల ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీచేస్తున్నందున ఎస్సీల వర్గీకరణను త్వరగా తేల్చాలని జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్‌ను ఎంఆర్‌పీఎస్ నాయకుడు కృపాకర్ మాదిగ నేతృత్వంలోని ఒక బృందం కోరింది. మంగళవారమిక్కడ ఈ మేరకు ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఈ కమిషన్ ఛైర్‌పర్సన్ జస్టిస్ ఉషకు బృందం వినతిపత్రమిచ్చింది. దీనిపై ఆమె స్పందిస్తూ- ఈ అంశంపై పరిశీలన ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనని, జాన్ వరకు గడువు ఉన్నందున ఆందోళన చెందక్కర్లేదని తెలిపారు. దీంతో బృందం నిరాశతో వెనుదిరిగింది. వర్గీకరణను త్వరగా తేల్చాలంటూ తాము కేంద్ర మంత్రి మీరా కుమార్‌ను కలిశామని, ఆమె కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదని కృపాకర్ మాదిగ విలేఖరుల వద్ద అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీల వర్గీకరణ చట్టం చేయాలని కోరారు. వర్గీకరణను జాప్యంచేస్తే మాదిగ అనుబంధ కులాల ప్రజలు రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ చొరవ తీసుకుని మాదిగలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. జస్టిస్ ఉషను కలసిన బృందంలో ఎంపీ విఠల్‌రావు తదితరులు ఉన్నారు.
వర్గీకరణ ప్రక్రియ ఆపేయాలి: కారెం
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే ఆపేయాలని మాలమహానాడు డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ఈ నెల 14న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో నిర్వహించనున్న కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ సభను అడ్డుకొంటామని హెచ్చరించింది. సభను అడ్డుకొనేందుకు 14న వేల మంది మాలలతో 'చలో జగ్గంపేట' కార్యక్రమం చేపడతామని మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ చెప్పారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడిన ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అండగా ఉంటామని ఆయన మంగళవారమిక్కడ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగితే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని మరో మాలమహానాడు కన్వీనర్ యర్రమల్ల రాములు ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఎంపీఆర్‌పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ బెదిరింపు రాజకీయాలకు తలొగ్గి వర్గీకరణను ప్రభుత్వం వేగిరం చేస్తోందని ఆయన ఆరోపించారు.

No comments: