Monday, June 29, 2009

అస్తిత్వ సాహిత్యాలను ఎదగనివ్వడమే నేటి ప్రజాస్వామ్యం

గురజాడ, చలం, శ్రీశ్రీ శత జయంతి, వర్ధంతి కార్యక్రమాలను, సంస్మరణ ప్రత్యేక సంచికలను, ప్రత్యేక కథనాల ప్రసారాలను ముమ్మరం చేసారు. ఇదంతా రచనా రంగంలో ఆధిపత్య కులాల పెత్తనాలను కాపాడుకునే ప్రయత్నాలే! తెలుగులో అస్తిత్వ సాహిత్యాలు బలంగా ముందుకు సాగుతున్నాయి. మాదిగ, దళిత, ముస్లిం, దళిత క్రైస్తవ, తెలంగాణ, బిసి సాహిత్యాలు ఇందుకు నిదర్శనం. మాదిగ సాహిత్య వేదిక, దండోరా- మైసమ్మ- ఏకలవ్య ప్రచురణలు, గుంపు సాహితి, భాగ్యనగర్ బుక్‌ట్రస్టు లాంటి అనేక ప్రచురణ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇపుడు మరో అడుగు ముందుకుపోయి ఎస్సి ఎస్టి బిసి మైనారిటి రచయిత్రుల వేదిక 'మట్టిపూలు' పరిమళం మొదలైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ సాహిత్యం వస్తూనే ఉంది. ఈ సాంస్కృతిక పునర్జీవనం కోస్తాయేతర ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణ కేంద్ర బిందువుగా సాగుతోంది. అలాగే అణగారిన అన్ని సమూహాల్లో ఈ పునర్జీవనం ప్రారంభమయ్యింది. అణగారిన కులం జాతి-తెగ-జెండర్-మతం- భాష- ప్రాంతాలకు చెందిన చైతన్యంతో వస్తున్న రచనలవల్ల బ్రాహ్మణ,శూద్ర ఆధిపత్యకులాల గుత్తనాయకత్వం, పట్టు క్రమంగా తగ్గిపోతోంది. అస్తిత్వ సాహిత్వాల ప్రతిఘటన ను, సవాళ్లను ఆధిపత్యకుల రచయితలు, వారి అభిమాను లు జీర్ణించుకోలేకపోతున్నారు.స్వాగతించలేకపోతున్నారు. దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, బిసీల జీవితాలను స్పృశించని కోస్తా బ్రాహ్మణ రచయితలు గురజాడ, శ్రీశ్రీ, చలం మొదలగువారిని బహుజన సమూహాలన్నింటికి సాహిత్య ప్రతినిధులుగా రుద్దే కుట్రలు జరుగుతున్నా యి. అనేకానేక పరిమితులున్న వారిని ప్రగతిశీల, అభ్యుదయ, ఆధునిక, విప్లవ సమగ్రతల మహత్తులు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి గొప్పతనం 'అనంత'మైనద ని ఆధిపత్య కులాల రచయితలు అంటున్నారు. భవిష్యత్ తరాలకు కూడా సమకాలికుడు గురజాడ అనీ, ముద్దుల గురజాడ అని, కన్యాశుల్కం - శ్రీశ్రీ శత జయంతి సందర్భాన్ని 'ఒకే ఆకాశంలో రెండు పున్నము'లని, జీవజలం చలం అనీ పాళీలు అరిగిపోయేలా పొగడ్తలు రాసేస్తున్నారు. వీరి శత జయంతి, వర్ధంతి కార్యక్రమాలను, సంస్మరణ ప్రత్యేక సంచికలను, ప్రత్యేక కథనాల ప్రసారాలను ముమ్మరం చేసారు. ఇదంతా రచనారంగంలో ఆధిపత్య కులాల పెత్తనాలను కాపాడుకునే ప్రయత్నాలే! నేటికీ ఆధిపత్య కులాలే పురోహిత, విద్య, పరిపాలన, సాంస్కృతిక, ఆర్థిక వ్యవస్థలను నియంత్రిస్తున్నాయి. వారసత్వం, భూమి (ధనం), కులంతో సమాజంపై పట్టు నిలుపుకునే ప్రయత్నాలను చేస్తూనే ఉన్నాయి. బహుజన సమూహాలపై సాంస్కృతిక దాడిని సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ఆధిపత్య కులాలు కొనసాగించే దుశ్చర్యలు జరుగుతూనే ఉన్నాయి. అస్తిత్వ ఉద్యమాల సంరంభాన్ని తెరమరుగుపరచటానికి ఆధిపత్యకులాలరచయితలు వొడి గడుతున్నారు. అస్తిత్వ ప్రవాహాలను అప్రధానం, అదృ శ్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నారు. మాదిగ, ముస్లిం, తెలంగాణ, బహుజనవాద రచయితలను గందరగోళపరి చి అస్తిత్వవాదాలనుండి మరలించి సాహిత్య రాజకీయా ల్లో పాలేర్లు (కార్యకర్తలు)గా, కోవర్టులుగా ఉపయోగించుకుంటున్నారు. కొన్ని సాహిత్య వేదికల ఏర్పాటు ఇందులో భాగమే. అప్పారావు, శ్రీశ్రీ, చలంలకు ప్రగతిశీల, అభ్యుదయ, విప్లవ ముద్రలు వేసి, పరోక్షంగా బ్రాహ్మణ రచయితల్లో గొప్పతనం ఉందనిచెప్పే మోసం జరుగుతున్నది. బ్రాహ్మణ రచయితలు గొప్పవారని ప్రచారం చేసి, తర్వా తి వరసలో శూద్రాధిపత్య కులాల ఆధిక్యతలను సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో స్థాపించుకునే దుర్నీతి ఇది. 'మంచియన్నది మాలయైతే, మాల నేనగుదున్' అన్నా డు గురజాడ. అప్పారావు దృష్టిలో మాల మంచిదో కాదో సందేహంగానే మిగిలింది! కన్యాశుల్కం నాటకంలో రామ ప్ప పంతులు అనే బ్రాహ్మణ పాత్ర చేత అసిరిగాడు (దళితుడు) పాత్రని ఉద్దేశించి 'అపవిత్రం ముండాకొడుకు ఏవై నా తింటాడు. బ్రాహ్మలం పవిత్రమైనవాళ్లం గదా' అని కుల వివక్ష ప్రదర్శిస్తాడు. అప్పారావు నేడు బతికుంటే తీవ్ర విమర్శలను ఎదుర్కొని ఉండేవాడు. కాలం చెల్లిన, అమానవీయమైన కన్యాశుల్కం అభ్యుదయ నాటకమని కీర్తించే సాహిత్యాభిమాన శిఖామణులు రాజ్యాంగంలోని అధికరణం 17 అంటరానితనాన్ని నిషేధించిందని, కుల వివక్ష శిక్షార్హమైన నేరంగా గ్రహిస్తే మంచిది. బ్రాహ్మణ బాలిక పూర్ణమ్మ దయనీయస్థితి గురించి రాసిన అప్పారావు, దళిత పాత్ర అయిన అసిరిగాడికి గౌరవప్రదమైన పేరు పెట్టకపోవటం, మానవ హుందాతనం కల్పించలేకపోవ టం, ఆయనలోని బ్రాహ్మణ వివక్ష, అహంకారం కాదా? సాహిత్యయుగాన్ని ఇకపై నేను నడిపిస్తున్నానని గొప్ప లు పోయిన శ్రీశ్రీ కవిత్వంలో 'భూతాలు, యజ్ఞోపవీతా లు' వంటి హిందూ గ్రాంధిక వ్యాకరణ (బ్రాహ్మణ) శబ్దా లు చాలానే ఉన్నాయి. వ్యాకరణంలో చందోబద్దంగా బ్రాహ్మణ రచయితలే రాస్తారు. దానిని తోసిపుచ్చి శ్రీశ్రీ వంటి బ్రాహ్మలే చందస్సు సంకెళ్లని చట్‌ఫట్‌మని తెంచేస్తారు! సాహిత్యంలో గ్రాంధిక రచనా బ్రాహ్మణ్యమైనా, సరళ రచనా బ్రాహ్మణ్యమైనా వారి సొత్తేకాని, బహుజన రచయితల సొత్తు కాదని చెప్పే అహంకార ప్రదర్శన ఇది. ఏ గొప్ప ప్రాధాన్యత, విలువైనా బ్రాహ్మణులకే తప్ప బ్రాహ్మణేతర రచయితలకు కాదనే కుల వివక్ష కూలిపోవాల. ఆఫ్రికా ఖండంలోని 'హాటెన్ టాట్, జూలు, నీగ్రో' లు కనిపించిన శ్రీశ్రీకి రాజకీయ, మానవ హక్కులకోసం దేశంలో దళితులు చేసిన ఏ పోరాటమూ, ఉద్యమమూ కనిపించకపోవటం ఎంత ఆశ్చర్యం! కవితా వస్తువుగా శ్రీశ్రీకి దళిత జీవితం పనికిరాకపోవటం అమానుషం అనిపించడంలేదా? పోనీ, ఇది శ్రీశ్రీ పరిమితి అని అతని అభిమానులు వొప్పుకుంటారా? 'కసాయిబు' తిట్టు పద సృష్టి చేసినందుకు శ్రీశ్రీ అస్తిత్వ చైతన్యం కలిగిన నేటి ముస్లిం రచయితల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సిఉండేది. బ్రాహ్మణ, శూద్రాధిపత్య కులాల స్త్రీల స్వేచ్ఛని రచన ల్లో చిత్రించిన చలానికి బహుజన జెండర్ శ్రమలు గుర్తుకురాకపోవటం వింతేమీ కాదు. అది ఆయన కులం పరిమితి. మాదిగపిల్ల శీర్షిక పెట్టి మాలపిల్ల కథ చెప్పటం చలం అసం బద్ధ వస్తువిజ్ఞతకే చెల్లింది! అప్పారావు, శ్రీశ్రీ, చలంలకున్న పరిమితులను చూడనీయకుండా బ్రాహ్మణ, కోస్తాంధ్ర సాహిత్యకారులు వారికి మహిమలు అంటగట్టే ప్రయత్నా లు మానుకుంటే అస్తిత్వప్రవాహాల ప్రజాస్వామ్యానికి మేలు చేసినవారవుతారు. అడుగుజాడలని, మహాకవులని, స్త్రీవి ముక్తి నిర్దేశకులని కోస్తా బ్రాహ్మణ కవులను పొగుడుకోవటం దురదృష్టకరం. దేశంలో మెజారిటీ అయిన అణాగారిన జాతుల జీవితాలను వస్తువుగా స్వీకరించని బ్రాహ్మణ రచయితలను ఆకాశానికెత్తటం ప్రజాస్వామ్యానికే విఘాతం. అప్రజాస్వామిక, నిరంకుశ సాంస్కృతిక ధోరణులను బలపరుస్తున్న కమ్మ, రెడ్డి, సాహిత్యకారుల తీరు మారాలి. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, మాదిగ, దళిత, ముస్లిం, బహుజన వాదాల రచయితలు మేల్కొని ఉండి సాహి త్యంలో పాత పల్లకీల మోతను గట్టిగా వ్యతిరేకించాలి. సమానత్వాన్ని కోరే అస్తిత్వ ఉద్యమాలను ఎదగనివ్వడమే నేటి సాహిత్య ప్రజాస్వామ్యం. ఆధిపత్య కులవాదులు తమ కొమ్ములు కత్తిరించుకోడానికి సిద్ధం కావాల్సిందే. కాదంటే సౌహ్రార్దతకు తావు లేని సాహిత్యానికి చదువురులూ శ్రోతలూ మిగలరు. - కృపాకర్ మాదిగ
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.