Wednesday, February 20, 2008

అడ్డంకులు ఇన్ని ఉంటే ఐక్యత ఎలా?- కృపాకర్ మాదిగ


మాదిగ, మాల కులాలకు చెందిన కొంతమంది మేధావులు, నాయకులు, అధికారుల మధ్య రెండు కులాల ఐక్యతకు సంబంధించి ఇటీవల పలుదఫాలు చర్చలు జరిగాయి. మళ్ళీ జరగను న్నాయి. ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని పక్కకుపెట్టి రాజ్యాధి కారం, భూమి, ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు, నోడల్ ఏజెన్సీ, బకాయి పడ్డ స్పెషల్ కాంపోనెంట్ నిధుల సాధన మొదలగు అంశాలపై ఉమ్మ డిపోరుకు సిద్ధమౌదామని చర్చల్లో మాల మేధావులు, నాయకులు ప్రతిపాదించారు. జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ల వర్గీకరణ జరగ కుండా, అందుకు సహకరించకుండా మాలకులస్తులు అడ్డు పడినంత కాలం ఈ రెండు కులాల మధ్య ఐక్యత సాధ్యం కాకపోవచ్చని మాదిగ మేధావులు, నాయకులు తేల్చిచెప్పారు. ఇరువైపులా కొద్దిమంది మేధా వులు, నాయకులు వర్గీకరణ సమస్యకంటె రాజ్యాధికారం, భూమి, ఇతర ఉమ్మడి సమస్యల పరిష్కారమే ప్రధానమని అన్నారు. ఉమ్మడి వేదిక అన్నారు. సమైక్య ఉద్యమమన్నారు. కొద్దిమంది మాదిగ, మాల నాయకుల మధ్య ఐక్యత ముడిపడినట్టే కనపడింది. మాల నాయకులు, మేధావులు కొంతమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మాది గ దండోరా ఉద్యమాన్ని బలహీనపరచడానికి ఉన్నట్టుండి ఐక్యతా రాగాలు ఆలపిస్తున్నారు. ఉమ్మడి డిమాండ్ల సాధన కోసం తమతో కలసి పోరాడమని మాదిగ నాయకులకు పిలుపునిస్తున్నారు. కొద్ది మంది నిజంగానే నిజాయితీతో రెండు కులాల ఐక్యతకోసం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాదిగలు, మాలలు ఐక్యం కావటానికి అవకాశాలు, ప్రాతిపదికలు, పరిస్థితులు ఎలా ఉంటే సాధ్యమౌతుందో మాదిగల వైపునుంచి విజ్ఞులైన మాల సోదరీ సోదరులకు కొన్ని ప్రతి పాదనలు నివేదిస్తున్నాము. దిగువ అంశాలలోని వాస్తవాలను, న్యాయబద్ధతను ఆచరణపూర్వకంగా మాల నాయకులు, మేధావులు, పెద్దలు అంగీకరించగలిగితే ఐక్యత సాధ్యమౌతుందని భావిస్తున్నాం.

(అ) జనాభా నిష్పత్తి ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగల రిజర్వేషన్లలో తమ తమ వాటాలు పొందటానికి మాదిగలు, రెల్లీలు, మెహతార్లు మొదలగు 59 షెడ్యూల్డు కులాల వారు చేస్తున్న డిమాండ్లు, ఉద్యమాలు న్యాయబద్ధమైనవని మాలలు గుర్తించాలి. ఈ మేరకు మాలల ప్రతినిధిబృందం ఒకటి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి, యుపిఏ చైర్‌పర్సన్, రాష్ట్రపతి, జాతీయ ఎస్‌సి కమిషన్ చైర్మ న్, ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై కేంద్రప్రభుత్వం నియమిం చిన జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్‌ను కలవాలి. తక్షణమే పార్లమెంటులో ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం జారీచెయ్యాలని ఆ రాజ్యాంగాధి పతులు, అధికారులను కోరాలి;

(ఆ) ప్రభుత్వ-ప్రైవేట్ విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక అవకాశాలలో 59 ఎస్‌సి కులాలలో ప్రతి కులానికి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వాటా అవకాశాలు కల్పించే సూక్ష్మస్థా యి పంపిణీ న్యాయసూత్రాలతో మాలలు ఏకీభవించాలి. ఉమ్మడి డిమాండ్ల సాధన కోసం మాదిగలు, మాలలు ఇతర షెడ్యూల్డు కులాల మధ్య రిజర్వేషన్ల వర్గీకరణతోనే ఐక్యతకు పునాది ఏర్పడుతుందని మాలలు అంగీకరించాలి. వర్గీకరణకు చొరవ తీసుకోవాలి;

(ఇ) రిజ ర్వేషన్ల వర్గీకరణ ప్రథమ ప్రాధాన్యంకల్గిన, ఉదాత్తమైన ఉమ్మడి లక్ష్యం గా మాలలు గుర్తించగలగాలి;

(ఈ) అన్ని స్థాయిల విద్యావకాశాల్లో, ఉద్యోగాల్లో, ఆర్థిక పథకాల్లో, రాజకీయ పక్షాల నాయకత్వాల్లో, పదవు ల ప్రాతినిధ్యంలో తమ జనాభా నిష్పత్తి కంటె అదనపు అవకాశాలు లభ్యమమవుతున్నప్పుడు, అటువంటి అదనపు అవకాశాలను మాల కులస్తులు వొదులుకోవాలి. అలా వొదులుకున్న అదనపు అవకాశా లను సరైన/కనీస ప్రాతినిధ్యం కోల్పోయిన మాదిగ, డెక్కలి, చిందు, బైండ్ల, రెల్లి, మెహతార్ మొదలైన మార్జినలైజ్డ్ షెడ్యూల్డ్ కులాలవారికి చెందేలా మాలలు బాధ్యత తీసుకోవాలి;

(ఉ) వర్గీకరణకు న్యాయ పరమైన, సాంకేతిక పరమైన అడ్డంకులను మాలలు కల్పించకూడదు. దళిత కులాల ఉమ్మడి సమస్యల పరిష్కారాల పంపిణీ న్యాయమే సామాజిక న్యాయమని, ఇందుకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ల వర్గీకరణే సాధారణమని, ఇందుకు తామూ కృషి చేస్తామని మాలలు ప్రకటించాలి;

(ఊ) ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ రిజర్వేషన్లను ఏ ఎస్‌సి కులానికి చెందాల్సినవి ఆ ఎస్‌సి కులానికి చెందకుండా, ఉమ్మడి అవకాశాలను పెంచుకునే , ఉమ్మడి దళిత ఉద్యమాలను శక్తివంతంగా నిర్మించలేమని మాల వారు వొప్పుకోవాలి;

(ఎ) నాడు చుండూరులో బాధితులైన మాలలకు న్యాయం జరగనీయకుండా రెడ్లు 'సర్వజనా భ్యుదయ పోరాటసమితి'ని స్థాపించారు. దళితులపై దాడులు చేశా రు. నిన్న బిసి రిజర్వేషన్ల కల్పనకు వ్యతిరేకంగా అగ్రకులాలవారు 'సిటిజన్స్‌ఫోరం' స్థాపించారు. బిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కేసువేశారు. ఇదే మాదిరిగా నేడు ఎస్‌సిలలో అత్యంత అణ గారిన, వెనకబడిన మాదిగలు, రెల్లి, అనుబంధ కులాలవారికి రిజర్వే షన్ల వర్గీకరణతో న్యాయం జరగనీయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర, జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్, జాతీయ ఎస్‌సి కమిషన్ దగ్గర అడ్డు తగులుతున్న మాల నేతలను, మాల మహానాడు నాయకులను అసాంఘిక శక్తులుగా, దళిత వ్యతిరేక శక్తులుగా మాలవారు ప్రకటిం చాలి. వారి అపరాధాలను, ప్రాబల్యాన్ని మాలలే అంతం చెయ్యాలి;

(ఏ) దళితులు, ఆదివాసులు, బలహీన వర్గాల సంక్షేమం, సాధికారం, సామాజిక న్యాయసాధన గురించి వివిధ వేదికలపై గట్టిగా మాట్లాడు తున్న మాల నాయకులు ప్రతి దళిత కులానికి సూక్ష్మస్థాయి పంపిణీ న్యాయం చేకూర్చగల రిజర్వేషన్ల వర్గీకరణను సమర్ధిస్తూ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మాల మేధావులు ఇప్పటికైనా బహిరం గంగా ఎస్‌సిల వర్గీకరణను సమర్థిస్తూ ప్రజాస్వామిక విలువలను చాటుకోవాలి;

(ఒ) ఎస్‌సిల సంక్షేమంకోసం అన్ని ప్రభుత్వ శాఖల్లో లైజన్ ఆఫీసర్లు ఉన్న మాదిరిగానే ప్రతి దళితకులానికి రిజర్వేషన్లలో పంపిణి ప్రాతినిధ్యం కల్పించటంకోసం- వర్గీకరణ సూత్రం అమలు కోసం- ప్రతి ప్రభుత్వ శాఖలో ప్రత్యేక అధికారులను నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాలవారు విజ్ఞప్తిచెయ్యాలి;

(ఏ) చివరిగా మాదిగలు, మాలల మధ్య సాంఘిక ఐక్యత లేకుండా రాజకీయ ఐక్యత సాధ్యంకాదని మాలవారు గుర్తించాలి. మాదిగలతో కులాంతర వివా హాలు, పండుగలు జరుపుకోవటానికి, అన్నిరకాల మానవీయ, భౌతి క, ఆత్మిక సదుపాయాలు, సంతోషాలు పంచుకోవటానికి, మాదిగలకం టె తాము అధికులముకామని నిరూపించుకోవటానికి మాలనాయకు లు, మేధావులు ఆచరణాత్మకమైన సంసిద్ధతతో ముందుకు రావాలి. ఇవన్నీ జరిగినప్పుడే మాదిగలు, మాలల మధ్య నెలకొన్న అపోహలు, అనుమానాలు, ఈర్ష్యలు, స్పర్థలు తొలగిపోతాయి. నిజమైన సహో దరత్వం, సమానత్వం, సమైక్యత, సహజీవనాలు మాదిగలు, మాలల మధ్య నెలకొంటాయి. లేకుంటే అగ్రకులాల పాలకులకు వినోదాన్ని మిగిల్చే బానిస శిబిరాల మధ్య పోరాటం (గ్లాడియేటర్స్)గా మాదిగ మాలల జీవితం నడుస్తుంది! మాదిగలు, మాలల ఐక్యత విషాదాంత నాటకంగా మారే ప్రమాదముంది!

(ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి లో ది:17-02-2008 న ప్రచురితమయ్యింది. దీన్ని పాఠకుల సౌలభ్యం కోసం మళ్ళీ అందస్తున్నాం.)


No comments: