Sunday, January 25, 2009

మనలో 'మన'మున్నామా? ( Andhra Jyothy 26-1-2009)

చరిత్రలో మాకు జరిగిన జరుగుతున్న రకరకాల మోసాల అనుభవాలున్న కారణంగా ఉమ్మడి రచయిత్రుల వేదిక పట్ల సంశయంతోనే 'మనలో మనం' సభలకు (జనవరి 10, 11 విశాఖపట్నం) వెళ్లడం జరిగింది. ఈ రెండు రోజులు కూడా స్త్రీ సాహిత్యం దళిత-బి.సి-గిరిజన -ముస్లిం స్త్రీలను పట్టించుకోలేదని, కలుపుకోలేదని, వారి సాహిత్యాన్ని కుక్క ముట్టిన కుండలాగానే దూరం బెట్టిందనే అవగాహనతో చర్చ ప్రారంభించాం. 'స్త్రీవాద' సాహిత్యం ప్రధానంగా కోస్తాంధ్ర ఆధిపత్యకులాల నుంచే వచ్చింది. దాని ఉధృతి పెరిగినా తగ్గినా దళిత బి.సి. మైనారిటీ రచయిత్రులకేం తరిగింది ఒరిగిందిలేదు. దళిత, బి.సి, ముస్లిం స్త్రీలకు కులం, శ్రమ, మతం, మగాధిపత్యం అణచివేతలు చుట్టుముట్టివున్నాయి.

కొద్దిమంది ఆధిపత్య కులాల స్త్రీలు జెండర్ ప్రాతిపదికన ఒకే అస్తిత్వం ఏకపక్షంగా ప్రకటించుకోవడం మాకు అభ్యంతరం. స్త్రీలంతా ఒకటి కాదు. కుల, మత, ప్రాంత అస్తిత్వాలతో ఎవరి కులాల్లో, ఎవరి శిబిరాల్లో ఎవరి పొయిలు వారికున్నయి. వారి సమస్యలు ప్రత్యేకంగా ఉన్నాయి. స్త్రీలంతా ఒక్కటే అనడం వల్ల స్త్రీలల్లో వున్న అసమానతల్ని వారి అస్తిత్వాల్ని మాట్లాడనివ్వకుండా అవగాహన చేస్కోలేని అప్రకటిత సెన్సార్‌షిప్‌లకు గురిచేసే, గురయ్యే ప్రమాదముంది. తద్వారా స్త్రీ సాహిత్యం అసమగ్రం అవుతుంది. ఈ సభల్లో ప్రధానంగా చర్చ జరిగింది దళిత, బి.సి, ముస్లిం స్త్రీల జీవితాల చుట్టూ ఆవరించిన ఆకాంక్షలకి, అభివృద్ధికి సాహిత్యం చేసిన కృషి, సేవ ఏమీలేదనే! వారి అనుభవాలు, సంఘర్షణలు, శ్రమదోపిడి, కుల దోపిడి, వారెదుర్కొంటున్న మగ వాదం దిశగా చర్చ జరగాలి అనే దాని చుట్టూ సభ స్పందించింది.

దళిత బి.సి. ముస్లిం స్త్రీల అస్తిత్వాలకు సంబంధించిన అధికార రాజకీయాల్ని ఏ మేరకు గుర్తిస్తున్నారు, అవి ఏ మేరకు సాహిత్యంలో భాగమయ్యాయి? రచయిత్రులకు ఉమ్మడి వేదిక కావాలనుకుంటే ముందుగా కోస్తాంధ్ర ఆధిపత్య కులాల స్త్రీల రచనలకు పరిమితమైన 'స్త్రీవాద' పదం, విస్తృతమైన-మెజారిటీగా వున్న-అణగారిన దళిత బి.సి. ముస్లిం గిరిజన స్త్రీల సాహిత్యానికి సరిపోదు, యిమడదు. అందుకే ఆ పదం పట్లనే మాకున్న అభ్యంతరాల్ని సభ ఆమోదించింది. ఇకమీదట దళిత స్త్రీవాదం, ముస్లిం స్త్రీవాదం అని మా సాహిత్యాన్ని సంబోధించొద్దు.

ఆ 'స్త్రీవాదం' అనే పదం లేకుండా దళిత మైనారిటీ బి.సి స్త్రీల విస్తృతి ప్రాతిపదికన ఒక కొత్త పదాన్ని రూపొందించుకోవాలనే మా అభ్యంతరంపై సభ ఆమోదం తెల్పింది. ఒకరిద్దరు ఆధిపత్య కులాల విప్లవ సంఘాల రచయిత్రులు ఈ కులాలు, అస్తిత్వాల కంటే శ్రమ స్త్రీల నుంచి సాహిత్యం రావాలి అన్నారు. ఆ విషయంతో మేము తీవ్రంగా విభేదించి శ్రమ-కులం వేరువేరుగా లేవు. కులమే శ్రమగా వ్యవస్థీకృతమైంది. కులమనేది పుట్టుకతోనే సంఘబానిసల్ని తయారు చేసింది భారతదేశంలో. కులమనేది శ్రమ విభజననే కాదు శ్రామికుల మధ్య విభజనను కూడా సృష్టించిందనే వాస్తవాన్ని తెలుసుకోవాలనే వాదన పెట్టాం. దాని చుట్టూ జరిగిన చర్చలో 'శ్రమ స్త్రీలు' ప్రత్యేకం అనే వాదం వీగిపోయింది.

ఇక వాకపల్లి వెళ్లడాన్ని ఉద్యమ యాత్రగా చెప్పటంపైన మా అభ్యంతరం వాళ్లకు స్వీపింగ్ కామెంట్‌లా కనిపించింది. వాకపల్లి వెళ్లి అరకు చూసిరావడాన్ని ప్రశ్నించడం వారికి మింగుడుపడలేదు. గుజరాత్ వెళ్లేప్పుడు ముస్లిం స్త్రీలు ఎందుకు కనిపించలేదు? అన్న ప్రశ్నకు జవాబులేదు. చుట్టూ ఇంత క్షోభ, ఇంత పోరాటం, ఇంత వస్తువు, ఆత్మహత్యలు, హత్యలు, అవమానాలు ఇన్ని జరుగుతుంటే మీరు మళ్లీ రామాయణ మహా భారతాల్లోకి వెనక్కి వెళ్లి రాయడం వస్తు రాహిత్యమా? బాధ్యతా రాహిత్యమా? అన్న ప్రశ్నకు సమాధానం లేదు.

పక్కనే ఉన్న సిరిసిల్లలో ఇన్ని ఆత్మహత్యలు జరుగుతుంటే ఎందుకు వెళ్లలేదంటే సమాధానం లేదు. దళిత బి.సి. ముస్లిం స్త్రీలు ఇంత విస్తృతంగా రాస్తుంటే, భాష అడ్డమొచ్చిందనో యాస అర్ధం కావట్లేదనో వంకలు పెట్టి వీరి సాహిత్యాన్ని దూరం ఉంచారు సరే, కనీసం అక్షర రూపంలో దాడి జరుగుతుంటే సపోర్టు కూడా ఇవ్వలేదు, ఎందుకు? అన్న ప్రశ్నకూ సమాధానం లేదు. ఇక వీరిలో నవలా రచయిత్రి ఒకరు 'ముద్దు పెట్టుకుంటున్న సమయంలో నేను స్త్రీనో పురుషుణ్ణో మరచిపోతాను... మనం రాసేదంతా కల్పనే కదా' అనడం అస్తిత్వవాదాలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లే కదా!

సాహిత్యమంతా కల్పనే అనే ప్రమాదకర స్టేట్‌మెంట్ ఇచ్చినట్లవుతుంది కదా! కథా రచయిత్రి ఒకరు 'బ్రాహ్మణ ఇళ్లల్లో పనిచేస్తారు, వాళ్లిచ్చినవి తింటారు, మా ఇళ్లల్లో పని చేయరు, మేమిచ్చినవి గోడవతల పడేస్తారు' అని దళితుల గురించి మాట్లాడారు. ఇలాంటి భావజాలాలతో నిండి ఉన్న మనస్సులు, మనుషులతో ఎలా కలిసిపోతాం? నిలువెత్తు గోడలు కట్టుకుని కూర్చుని 'మనలో మనం' అనడం ఎంతవరకు సబబు? అనిపిస్తున్నది.

అగ్రవర్ణ పురుషాధిపత్యాన్ని ప్రశ్నించడం వరకే పరిమితమైన స్త్రీవాద సమూహం, మెజారిటీగా ఉన్న బి.సి, దళిత, మైనారిటీ స్త్రీల సమస్యలపై ఏనాడు స్పందించింది లేదు. వారి సమస్యలపట్ల అంటీముట్టనట్లుగా ఉండటమే కాక దళిత రచయిత్రులు లేవనిత్తిన ప్రశ్నలకు కూడా వీరి వద్ద సమాధానాలు లేవు. కుల వివక్ష గురించి, మత దాడుల గురించి వీళ్లు మాట్లాడింది లేదు.

అదేదో తమకు సంబంధించని విషయంగానే చూస్తూ వస్తున్నారు. ముస్లిం రచయిత్రుల భాషపట్ల వచ్చిన విమర్శ కూడా తెలిసిందే. ముస్లిం స్త్రీలు తమ మతం వల్ల గురయ్యే హింస గురించి రాసినపుడు సపోర్టు చేసినంతగా హిందూత్వవాదుల దాడుల గురించి రాసినదాని పట్ల మౌనంగా ఉండటం గమనించవచ్చు. అలాగే స్త్రీవాదులెప్పుడూ ప్రజాస్వామికోద్యమమైన ప్రత్యేక తెలంగాణకు మద్దతిచ్చింది లేదు. మరో ప్రజాస్వామిక ఉద్యమమైన మాదిగ దండోరా పట్ల కూడా మద్దతు ప్రకటించలేదు. మరి వీరెలా ప్రజాస్వామికవాదులవుతారు? ఉమ్మడి వేదికను చారిత్రక ఘట్టంగా వర్ణిస్తూ, 'మేమే చేశాం' అని చెప్పుకోవడానికే మమ్మల్ని ఆహ్వానించినట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే ఇంతకు మునుపు వీళ్లెవరూ అస్తిత్వ వాదాల గురించి మాట్లాడటం, రాయడం చేయలేదు. కదులుతున్న నీలిమేఘాలు ఎవరిని కబళించాలని? ఉరుముతున్న నల్లమబ్బుల మీద వీరికి ప్రేమ లేదు. పైగా మా జాతుల మీద ప్రేమ లేని రచనలూ వీరి పుస్తకాల్లో చూడొచ్చు. ఉన్న గ్యాప్స్‌ని కొత్త ఋతువుల కింద పూడ్చేయాలని చూస్తున్నారా? అస్తిత్వాల గొంతు నొక్కేయాలనుకుంటున్నారా? ఇంకా ఇలాంటి అనేకానేక కారణాల వలన, 'స్త్రీవాదం'తో మేము మమేకం కావడం వల్ల మా అస్తిత్వాల్ని వారు మింగేసే ప్రమాదం ఉండొచ్చని భావిస్తున్నాం.

మా ప్రత్యేక అస్తిత్వాల్ని గుర్తించ నిరాకరించే 'స్త్రీవాదులు' మా వాదాల్ని, వాదనల్ని గౌరవించనపుడు వారితో కలిసి పని చేయడం ప్రశ్నార్థకమవుతుంది. మా భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినవారమే అవుతాం. మా సందేహాలకు, సంశయాలకు స్పష్టమైన సమాధానాలు దొరికితే ఉమ్మడి వేదిక సాధ్యం కావొచ్చేమో! లేకపోతే మా పోరాటం మేము ఎలాగూ చేస్తూనే పోతాం.

- జూపాక సుభద్ర, షాజహానా

1 comment:

Unknown said...

* An armed society is a POLITE society.
* And it is not FEAR that keeps us polite -- it is RESPONSIBILITY.

* I suppose Madiga in India to OWN a hand gun to protect their INTEGRITY and for SELF-DEFENSE.
* And arms LICENSE from Police Department costs just 100 rupees in India.

http://hyderabadpolice.gov.in/License&Permissions/ArmsLicense.htm