Friday, January 23, 2009

అవకాశంలో సగభాగం ( జూపాక సుభద్ర తో సూర్య దినపత్రిక 23-1-2009 ఇంటర్వ్యూ)


మంచి అవకాశం వస్తే అప్పటికప్పుడు ఎంతటి బాధ్యతనైనా నిర్వర్తించడానికి తయారవుతున్నారు నేటి మహిళలు. అప్పటి వర కూ ఉద్యోనిగా, రచయితగా ఉన్న సెక్రటేరి యేట్‌ ప్రభుత్వ కార్యదర్శి జూపాక సుభద్రకూ ఇలాంటి ఓ సదవకాశం దక్కింది. ఈనెల 24న జరగనున్న సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్ని కల్లో ఆమె మొదటి మహిళా అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. ప్రఖ్యాత తెలంగాణ వాద రచయితగా ఆమె అందరికీ సుపరిచితమే. ఉద్యోగుల, మహిళా సంక్షేమమే తన ధ్యేయమంటోన్న సుభద్రతో ధీర ఇంటర్వ్యూ...
..............

మీకీ అవకాశం ఎలా వచ్చింది?


రచనల ద్వారా నా అంతరంగ భావాలను గుర్తించిన ఉద్యోగులు నన్ను బరిలో దిగటానికి ప్రోత్సహించారు. నాదంతా తెలంగాణా దళిత నేపథ్యం. నేను స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చాను. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం దాకా అన్ని విద్యార్థి నాయకత్వ కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. ఎం.ఫిల్‌ చేస్తుండగా సచివాలయ, సర్వీసులో సహాయ విభాగ అధికారిగా 1988లో చేరాను. ప్రస్తుతం సహాయ కార్యదర్శిగా గృహనిర్మాణ శాఖలో విధులు నిర్వహిస్తున్నాను.

సచివాలయంలో మార్పులు తీసుకురావడానికి మీరు ఎలాంటి పాత్ర నిర్వర్తించారు?


సచివాలయంలో దాదాపు 3,600 మంది ఓటర్లు ఉన్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘంలో మహిళలకు ప్రాతినిధ్యం లేని పరిస్థితులుండేవి. 1991లో అదనపు కార్యదర్శిగా పోటీ చేసి గెలిచిన మొదటి మహిళగా గుర్తింపు సాధించాను. అదే సంవత్సరం మహిళా ఉద్యోగుల కోసం సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం స్థాపించాను. దీని ద్వారా మహిళల్లో నాయకత్వ లక్షణాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రసూతి సెలవులను నాలుగు నెలలకు పొడగించడం, ఉద్యోగిణులకు ప్రత్యేక బస్సు సౌకర్యం, వంట గ్యాస్‌ ఉదయం పది గంటలకు ముందు, సాయంత్రం ఐదు గంటల తరువాత ఉద్యోగులకు సరఫరా చేసే విధంగా జీవోలు సాధించుకున్నాం. వీటన్నింటికి బాధ్యత నేనే వహించాను.

ఉద్యోగిణులు ఉన్నత నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారని మీరు భావిస్తున్నారా?


స్త్రీకి నాయకత్వం వహించే సంపూర్ణ స్వేచ్ఛ ఇంకా లభించలేదు. కుటుంబ చట్రం, ఆర్థిక, సామాజిక, జెండర్‌ అణిచివేతలు ఇవన్నీ మహిళకు నిరంతర సవాళ్లుగా ఎదురవుతున్నాయి. అందుకే మహిళ ఉన్నత నాయకత్వాన్ని అందుకోలేకపోతుంది.

మరి నాయకత్వ స్థానాల్లో ఎదగటానికి అధిగమించవల్సిన అంశాలేమిటి?


న్యూన్యతని వదులుకోవాలి. ఆత్మ విశ్వాసాన్ని, చొరవని ప్రదర్శించాలి. ప్రోత్సాహాన్నందించే సామాజిక, కుటుంబ వాతావరణం కూడా పెరగాలి.

అధ్యక్ష్యురాలిగా గెలిస్తే?


ముందుగా ఖాలీ ఉద్యోగాలని భర్తీ చేస్తాను. పని భారానికి సరిపోయే కొత్త పోస్టులకోసం, ప్రమోషన్‌‌స, అవకాశాలు, స్పోర్‌‌ట, కల్చరల్‌ గ్రాంట్‌‌స పెంపు కోసం కృషి చేస్తాను. స్థలాలు, ఇళ్ల నిర్మాణంలో ఉద్యోగులందరికీ బాధ్యతాయుతమైన న్యాయమందిచడం కోసం కృషి చేస్తాను. వైద్య సదుపాయాల కోసం నిధుల పెంపు, క్యాంటీన్‌ ధరల తగ్గింపు.... ఇతరత్రా కార్యక్రమా లను పారదర్శకతతో నిర్వర్తిస్తాను.

ఉద్యోగిణులకు మీరిచ్చే విజన్‌ ఏమిటి?


నాయకత్వ స్థానాల్లో అన్నిచోట్ల పురుషులతో సమానంగా ఎదగాలి. అన్ని రకాల అవకాశాల్లో సగం వాటా మహిళలు పొందాలి. వివక్షకు తావులేని సమాజం కోసం మహిళా నాయకత్వాన్ని వారి సాధికార శక్తిని నిరంతరం పెంచుకోవాలి.

( సూర్య 23-1-2009 సౌజన్యంతో)

No comments: