Wednesday, March 12, 2008

submitted affidivit for rationalisation of SC Reservations, by P.Krupakar Madiga

submitted affidivit for rationalisation of SC Reservations

త్వరగా తేల్చండి: కృపాకర్

న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: గ్రూప్-1, గ్రూప్-2 ఖాళీలు, ఉపాధ్యాయులు, పోలీసులు తదితర వేల ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీచేస్తున్నందున ఎస్సీల వర్గీకరణను త్వరగా తేల్చాలని జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్‌ను ఎంఆర్‌పీఎస్ నాయకుడు కృపాకర్ మాదిగ నేతృత్వంలోని ఒక బృందం కోరింది. మంగళవారమిక్కడ ఈ మేరకు ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఈ కమిషన్ ఛైర్‌పర్సన్ జస్టిస్ ఉషకు బృందం వినతిపత్రమిచ్చింది. దీనిపై ఆమె స్పందిస్తూ- ఈ అంశంపై పరిశీలన ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనని, జాన్ వరకు గడువు ఉన్నందున ఆందోళన చెందక్కర్లేదని తెలిపారు. దీంతో బృందం నిరాశతో వెనుదిరిగింది. వర్గీకరణను త్వరగా తేల్చాలంటూ తాము కేంద్ర మంత్రి మీరా కుమార్‌ను కలిశామని, ఆమె కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదని కృపాకర్ మాదిగ విలేఖరుల వద్ద అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీల వర్గీకరణ చట్టం చేయాలని కోరారు. వర్గీకరణను జాప్యంచేస్తే మాదిగ అనుబంధ కులాల ప్రజలు రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ చొరవ తీసుకుని మాదిగలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. జస్టిస్ ఉషను కలసిన బృందంలో ఎంపీ విఠల్‌రావు తదితరులు ఉన్నారు.
వర్గీకరణ ప్రక్రియ ఆపేయాలి: కారెం
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే ఆపేయాలని మాలమహానాడు డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ఈ నెల 14న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో నిర్వహించనున్న కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ సభను అడ్డుకొంటామని హెచ్చరించింది. సభను అడ్డుకొనేందుకు 14న వేల మంది మాలలతో 'చలో జగ్గంపేట' కార్యక్రమం చేపడతామని మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ చెప్పారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడిన ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అండగా ఉంటామని ఆయన మంగళవారమిక్కడ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగితే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని మరో మాలమహానాడు కన్వీనర్ యర్రమల్ల రాములు ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఎంపీఆర్‌పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ బెదిరింపు రాజకీయాలకు తలొగ్గి వర్గీకరణను ప్రభుత్వం వేగిరం చేస్తోందని ఆయన ఆరోపించారు.

ప్రవేశం, ప్రాతినిధ్యంతోనే ప్రజాస్వామ్యం

-కృపాకర్ మాదిగ

రిజర్వేషన్లపై చర్చ, రిజర్వేషన్ల వర్గీకరణ మీద చర్చ ఇప్పుడు ఆసక్తిదాయకంగా జరుగుతోంది. మహిళలకోసం ప్రవేశపెట్టిన 33 శాతం రిజర్వేషన్ల బిల్లులో ఆయా సామాజిక వర్గాల మహిళలకు కోటాలు విధించిన అనంతరమే పార్లమెంటు ఆమోదించాలని మాయావతి, ములాయం సింగ్‌ తదితరులు డిమాండు చేస్తున్నారు. దళిత, ఆదివాసీ, ఓబీసి, మైనారిటీ మహిళల హక్కుల్ని గౌరవించేవారు ఈ డిమాండును బలపరుస్తున్నారు. మగ, కుల దురహంకార పార్టీలు మహిళా బిల్లును ప్రహసనం క్రింద మార్చేశాయి. వెనకబడిన తరగతుల వారి ఆందోళనల ఫలితంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇంతకాలానికి ఇటీవలె కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసింది. దీనికి వ్యతిరేకంగా అగ్రకులాల విద్యార్థులు, డాక్టర్లు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) వేదికగా చేసిన నానా యాగీని వర్ణ మీడియా బహు వర్ణాల్లో ప్రదర్శించింది. ఆదివాసి రిజర్వేషన్ల మొత్తాన్ని లంబాడి, ఎరుకల వంటి మైదాన ప్రాంతాలకు చెందిన కొన్ని ఆదివాసీ తెగలే అధికభాగం పొందుతున్నారని, ఇలా కాకుండా అడవుల్లో, కొండకోనల్లో, మారుమూల ప్రాంతాల్లో నివశిస్తున్న గిరిజన జాతులన్నింటికీ జనాభా నిష్పత్తి ప్రకారం అందేవిధంగా యస్టీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించాలని కోయ, చెంచు మొదలైన జాతులవారు ఆదివాసి తుడుందెబ్బ ఉద్యమం చేస్తున్నారు. కొద్దిమంది లంబాడీ, ఎరుకల తెగలవారు యస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. యస్టీ రిజర్వేషన్లు వర్గీకరించటానికి, యస్టీల్లో క్రీమీలేయర్ విధానం పెట్టడానికి సంబంధించిన ముసాయిదా బిల్లును పార్లమెంటు స్థాయీ సంఘం తయారు చేసిందని గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా జాతీయ మీడియాలో వార్తలు రావడం ముదావహం. కరువు ప్రాంతాలను, మారుమూల ప్రాంతాలను, వెనకబడిన ప్రాంతాలను గుర్తించాలని పెద్ద జిల్లాలను చిన్న జిల్లాలుగా, పెద్ద రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చెయ్యాలని జాతీయ స్థాయిలో ఆందోళనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశం ఒక దేశంగా ఏర్పడితే, ఆంధ్రప్రదేశ్ నాలుగు చిన్న రాష్ట్రాలుగా ఏర్పడితే నష్టమేమిటో, తప్పేమిటో సమైక్యత, సమగ్రతావాదులు చెప్పలేకపోతున్నారు. పైన పేర్కొన్నవన్నీ కొన్ని రకాల వర్గీకరణలే. ఆకలైనవారు అన్నం తింటామంటే, రోగం వచ్చినవారు నయం చేసుకుంటామంటే ఎట్లా సరైనదో, అవకాశాల వర్గీకరణ, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కూడా అంతే ఆరోగ్యకరమైనది.

విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో దళితులకు రాజ్యాంగం ఇస్తున్న యస్సీ రిజర్వేషన్లలో సింహభాగాన్ని దళితుల్లో సాపేక్షికంగా అభివృద్ధి సాధించిన మైనారిటీ మాల కులస్తులే పొందుతున్నారు. అలా కాకుండా, దళితుల్లో అత్యధికంగా వెనకబడిన, మెజారిటీలైన మాదిగ, రెల్లి, అనుబంధ కులాల వారికి, అలాగే మాల, అనుబంధ కులాలకు, వారి వారి కులాల జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి వాటా రిజర్వేషన్లు వారు పొందేలాగ ఎస్ సి రిజర్వేషన్లను ఎబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని మాదిగలు ప్రభుత్వాన్ని డిమాండు చేస్తూ గత 20 ఏళ్ళుగా దండోరా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.

మతాధికారం, భూమి, వ్యాపారం, సంపద, రాజ్యాధికారాలపై పట్టు సంపాదించుకున్న ఆధిపత్య కులాల చేతుల్లో మెజారిటీ దేశ ప్రజలైన దళితులు, ఆదివాసులు, వెనకబడిన తరగతులవారు నిర్ణయాధికార శక్తిని కోల్పోయారు. తగిన ప్రాతినిధ్యాన్ని, ప్రాధాన్యతను కోల్పోయారు. బ్రాహ్మణీయ కుల వ్యవస్థ బ్రాహ్మణుల కింద క్షత్రియుల్ని, క్షత్రియుల క్రింద వైశ్యుల్ని, వైశ్యుల కింద శూద్రుల్ని , శూద్రుల కింద మాలల్ని, మాలల కింద మాదిగలను పేర్చింది. అంతస్తుల వారి సామాజిక చట్రంలో బిగించింది. పుట్టుకతోనే వ్యవస్థీకృత సంఘ బానిసలుగా మాదిగల చేసింది. మనువాదం ఏరెండు కులాలు / జాతులు/తెగలు/ తరగతులు సమానం కాదంది. కులాల మధ్య కంచం, మంచం పొత్తులు కూడదంది. కులంలో బాహ్య వివాహాలను నిషేధించింది. అంతర్వి వాహాలను తప్పనిసరి చేసింది. పై కులాన్ని చూసి ఈర్ష్య , కింది కులాన్ని చూసి ఊరట పొందే అనాగరిక మానవుల్ని కులం తయారు చేసింది. చివరకు బడిత ఉన్నోడిదే బర్రె, గుదప ఉన్నోడిదే గుర్రం సామెతలా కులబలం, ధనబలం ఉన్నోడిదే రాజ్యం అనే విలువకు కుల వ్యవస్థ పట్టం కట్టింది.

పుట్టుక, వృత్తి కారణాలుగా మాదిగ, రెల్లి అనుబంధ కులాలపై వేల సంవత్సరాలుగా అంతులేని కుల వివక్ష అమలు జరిగింది. వెట్టిచాకిరి, పాకి వృత్తి, జోగిని, బాణామతి, అంటరానితనం, పేదరికం, నిరక్షరాస్యత, అనైక్యత, అశక్తత తదితర అమానుష వ్యవస్థల్లో మాదిగ, రెల్లి అనుబంధ కులాలను కుల వ్యవస్థ బందీలను చేసింది. మనువాదం గుడి, బడి, భూమి, నీరు, అధికారాలలో మాదిగలకు ప్రవేశాన్ని నిరాకరించింది.

నాటి పరిస్థితులు కొంత మారాయి. సమాన గౌరవం, సమాన పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, విద్య, ఉద్యోగాలలో, శాసన సభల్లో ప్రాతినిధ్యం, ప్రత్యేక సదుపాయాలు, రక్షణ కావాలని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నాయకత్వంలో నిమ్న జాతుల వారు (దళితులు, ఆదివాసులు, వెనకబడిన తరగతులు) పోరాడారు. నిమ్న జాతుల హక్కులకోసం 1930, 31,32 సంవత్సరాల్లో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో బ్రిటీష్ ప్రభుత్వ ప్రతినిధుల ముందు డాక్టర్ అంబేడ్కర్ ప్రాతినిధ్యం వహించారు. దళితుల సమస్యలు కేవలం మతపరమైనవేనని, అవి సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలు కావని దళితుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ అగ్రకుల నాయకత్వంతో నాటి దళిత నాయకత్వం పోరాడింది. దళితులు హిందువుల్లో భాగమే. వారికి ప్రత్యేక హక్కులు ఎందుకన్న గాంధీజీ అభిప్రాయాలతో అంబేడ్కర్ సంఘర్షించాడు. స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు వ్యతిరేకమైందే కుల వ్యవస్థ అని అంబేడ్కర్ అన్నారు. స్వాతంత్య్రానంతరం సమానత్వం, న్యాయం, సహోదరత్వాలు పునాదిగా కలిగిన నవభారత రాజ్యాంగం ద్వారా విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో ప్రత్యేక సదుపాయాలను (రిజర్వేషన్లు), రక్షణను నిమ్నజాతుల వారు అంబేడ్కర్ నాయకత్వంలో సాధించుకున్నారు.

నిమ్నజాతులు పోరాడి సాధించుకున్న రిజర్వేషన్లను సంపూర్ణంగా అమలు చెయ్యటంలో స్వాతంత్య్రానంతర ప్రభుత్వాలు ఏనాడూ చిత్త శుద్ధిని ప్రదర్శించలేదు. ప్రతిఘటన ఎదురౌతుందనుకున్నప్పుడే కొద్దిమేరకైనా రిజర్వేషన్లను అమలు జరిపాయి. నిమ్నజాతులు హక్కుగా సాధించుకున్న రిజర్వేషన్లను అగ్ర కుల ప్రభుత్వాలు భిక్షం స్థాయికి దిగజార్చాయి. రిజర్వేషన్ల ద్వారా లభించిన ప్రాతినిధ్యాన్ని స్వతంత్రమైనదిగా వుండనీయక, చెంచాగిరి స్థాయికో లేదంటే తమపై ఆధారపడే స్థాయికో అగ్రకుల రాజకీయ పార్టీలు మార్చివేశాయి.

రిజర్వేషన్లు అందుకోవడంలో ఆదియాంధ్రులతో మాలలు, మాలలతో మాదిగలు, మాదిగలతో రెల్లి, మెహతార్లు పోటీ పడలేకపోయారు. మాదిగల డిమాండు మేరకు 1996 లో రాష్ట్ర ప్రభుత్వం యస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పరిశీలనకోసం నియమించిన జస్టీస్ రామచంద్రరాజు కమీషన్ ఇదే విషయాన్ని నిర్ధారించింది. ఆయా కులాల జనాభా నిష్పత్తుల ప్రకారం రిజర్వేషన్లను ఎబిసిడి గ్రూపులుగా విభజించడంతో పాటు అత్యంత వెనకబడిన షెడ్యూల్డు కులాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఎవరి వాటా రిజర్వేషన్లు వారికి అందించే విధంగా ప్రభుత్వం చట్టం చెయ్యాలని జస్టీస్ రామచంద్రరాజు కమీషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో సిఫారసు చేసింది. నాటి ప్రభుత్వం కమీషన్ నివేదికను ఆమోదించింది. అఖిల పక్ష పార్టీలన్నీ ఆమోదించాయి. షెడ్యూల్డు కులాల వర్గీకరణ విధానాన్ని బలపరుస్తూ 1998 ఏప్రిల్ 22 న శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. 2000 ఏప్రిల్ ఒకటినాడు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా యస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని చేసింది. మాదిగ, రెల్లి, మాల, ఆదియాంధ్ర కులాలు వారి వారి వాటా రిజర్వేషన్లను ఈ చట్టం అమలుతో ఐదేళ్ళపాటు పొందారు. మాదిగ, రెల్లి కులాల వారికి కొంతమేర న్యాయం జరిగింది.

వర్గీకరణ చట్టం వలన మాలలు, ఆదియాంధ్రులకు వారు పొందవలసిన వాటా రిజర్వేషన్లు వారికి అందాయి. ఐతే, అప్పటివరకు యాభై ఏళ్ళు పొందిన అదనపు రిజర్వేషన్లు రాకుండా ఆగిపోయాయి. దీనిని కొందరు మాలలు, ఆదియాంధ్ర మాలలు అంగీకరించలేకపోయారు. మాదిగ- మాలల్ని చీల్చి, అగ్రకుల రాజకీయ పార్టీల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని మాదిగ నాయకుల్ని నిందించారు. మాదిగ నాయకులు అనవసర సమస్యలు సృష్టిస్తున్నారని, చిన్న సమస్యని పెద్దది చేశారన్నారు. మాల నాయకులు కొందరు యస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని ప్రాధాన్యతలేని విషయంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మాలపెద్దలు మాదిగ నాయకులతో ముందు మరిన్ని అవకాశాలు పెంచుకుందాం, తర్వాత పంచుకుందాం అన్నారు. మరికొంతమంది మాల పెద్దలు రిజర్వేషన్లు దళితులకు అగ్రవర్ణాల వారు వేస్తున్న భిక్షమని, భిక్షం పంపకం కోసం గొడవమాని భూమికోసం, రాజ్యాధికారం కోసం ఉమ్మడిగా పోరాడుదాం కలిసి రండని మాదిగ నాయకులకు ప్రతిపాదించారు. ఉన్న రిజర్వేషన్లను పంచుకుందాం ముందుకు రండని మాదిగలు ప్రతిపాదిస్తే, ‘ఉన్నవా? ఎక్కడున్నాయి? ఉన్నవి మావే! ఏమిటి పంచుకునేది? మీకు దిక్కున్నచోట చెప్పుకోండి, పొండి’ అనే అన్యాయమైన అహంభావ ధోరణిని మాల నాయకులు ప్రదర్శించారు.

వర్గీకరణ చట్టానికి వ్యతిరేకంగా మాల నాయకులు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. రాజ్యాంగం ప్రకారం యస్సీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదని స్పష్టం చేస్తూ, 2004 నవంబర్ 5 నాడు సుప్రీంకోర్టు వర్గీకరణ చట్టాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. మాల మనువులు ఇంతటితో ఆగిపోలేదు. ఐదేళ్ళుగా వర్గీకరణ ప్రకారం జరిగిన అడ్మిషన్లు, ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లను రద్దు చెయ్యాలని మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేశారు. వర్గీకరణ చట్టం రద్దుకాక మునుపు జరిగిన ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లు, అడ్మిషన్లు, కారుణ్యదృష్టితో యధావిధిగా వుంటాయని, వర్గీకరణ చట్టం రద్దు తర్వాత జరిగినవి మాత్రమే రద్దవుతాయని సుప్రీంకోర్టు 2006 సెప్టెంబర్ 25 న ఇచ్చిన తీర్పులో పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పులతో 80 లక్షలమంది మాదిగలు నిరాశపడలేదు. మరింత పట్టుదలని పెంచుకున్నారు. ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఎస్.సి రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పార్లమెంటులో చట్టం చేయించడానికి పూనుకోవాలని డిమాండు చేస్తూ 2004 డిసెంబర్ 10 నాడు వేలాదిమంది మాదిగలు ఛలో అసెంబ్లీ నిర్వహించారు. అదేరోజు యస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకోసం పార్లమెంటులో అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మాదిగలు పార్లమెంటు ముందు దండోరా వేశారు. ప్లీనరీని నిర్వహించారు. దీనితో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకోసం 25-9-2006 న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ దొరై స్వామిరాజు కమీషన్ నియమించింది. ఈ కమీషన్ విచారణా కాలవ్యవధిని ఏడాది నుంచి 3 నెలలకు కుదించి, విచారణను త్వరితగతిన పూర్తి చేయించాలి. పార్లమెంటులో సత్వరమే వర్గీకరణ చట్టం చేయించుకోవడం ద్వారా రానున్న విద్యా సంవత్సరంలోనైనా వర్గీకరణ ఫలితాలు తమ విద్యార్థినీ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అందించాలని మాదిగ, రెల్లి అనుబంధ కులాల ప్రజలు ఆశతో ఉద్యమిస్తున్నారు.

రిజర్వేషన్లు లేకుండా, తమ వాటాకు మించిన అవకాశాలు పొందకుండ కేవలం ప్రతిభ ద్వారానే మాలలు 24 మంది సిట్టింగ్‌ యమ్మెల్యేలు, 5 మంది సిట్టింగ్‌ యంపీలు, కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులు, వందమంది ఐఎయష్లు, ఐపియష్లు వందలాదిమంది అధికారులు, లక్షలాదిమంది ఉద్యోగులు కాగలిగేవారా? ఇంత ప్రతిభే వారికుంటే రిజర్వేషన్లు తీసుకోవడం ఎందుకు? బహిరంగ పోటీలోకి వెళ్ళవచ్చుకదా? యస్సీ రిజర్వేషన్లలో సింహభాగం అనుభవించినందుకు షెడ్యూల్డు జాబితానుంచి మాలకులస్తులను తొలగించా లని 1965 లో రిజర్వేషన్ల అధ్యయనంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన బి.యన్.లో కూర్ కమిటి చేసిన సిఫారసును అమలు కానీయకుండా మాల నాయకులు అడ్డుకోవడం ఎందుకు? దశాబ్దాల క్రితమే రాష్ట్రంలో ప్రభుత్వం బిసి రిజర్వేషన్లను ఎబిసిడి గ్రూపులుగా వర్గీకరించింది. ఇందువలన బీసీల మధ్య స్పర్థలు తొలగిపోయాయి, సుహృద్భావం, సంఘీభావం బలపడింది. కాదా? అలాగే యస్సీ రిజర్వేషన్లను ఎబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తే మాలలకు ఎటువంటి నష్టం రాదు. జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రావలసిన వాటా రిజర్వేషన్లు వారికి తప్పక అందుతాయి. మార్టిన్ లూథర్ కింగ్‌ నడిపిన మానవహక్కుల ఉద్యమం ఫలితంగా నల్లజాతీయులకు, ఇతర సామాజిక వివక్షల నెదుర్కొంటున్న వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 1964 లో అమెరికాలో పౌరహక్కుల చట్టం వచ్చింది. అణగారిన వర్గాలకు అమెరికాలోనూ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మాలలతో, మాదిగ, రెల్లి అనుబంధ కులాలవారు పోటీ పడలేకపోతున్నపుడు వారి వారి వాటాల ప్రకారం రిజర్వేషన్లు విడదీసి ఇవ్వమని అడగటం తప్పెలా అవుతుంది. మాలల్లో ఎంతోమంది నాయకులు, విద్యావేత్తలు, తత్వవేత్తలు, కవులు, రచయితలు, గాయకులు, వక్తలు, పాత్రికేయులు, కార్యకర్తలు, మేధావులు, పెద్దమనుషులు న్నారు. వీరిలో చాలామంది బుద్దుడు, జీసస్, అంబేడ్కర్, మావో వారసులమని చెప్పుకుంటుంటారు. సామాజిక న్యాయం, విప్లవం కావాలని మాట్లాడుతుంటారు. రిజర్వేషన్లలో పంపిణీ న్యాయం కావాలని మాదిగ, రెల్లివారు చారిత్రక ఉద్యమం చేస్తుంటే, మాదిగలు - మాలల మధ్య ఇంత పెద్ద కులయుద్దం జరుగుతుంటే వారంతా ఏమయ్యారు? మాల శక్తులే అడుగడుగునా వర్గీకరణకు అడ్డుపడ్డారు. ఐనా, మాదిగ నాయకులు మాల నాయకుల్ని శతృవులుగా ప్రకటించలేదు. మాదిగలు ప్రభుత్వం పైననే పోరాడుతున్నారు. మాల మేధావులు న్యాయం కోరుతున్న రెల్లి, మాదిగల వైపులేరు. తమ్ముడు తనవాడైనంత మాత్రాన ధర్మం మాట్లాడకుండ ఎన్నాళ్ళిలా నోళ్ళు కట్టేసుకుంటారు. మాల మహానాడు నాడులూ, శక్తులా వీరు? కారా? న్యాయం తీర్చి పెద్దరికాన్ని నిలుపుకోలేరా? కాదన్నా, జాంబవంతుని వారసులు చూస్తూ ఊరుకోరు. దీర్ఘశాంతం, పట్టుదల, శక్తి కలిగిన మాదిగలు తమకు జరిగిన సామాజిక అన్యాయాన్ని, అసమానతలను గూటందెబ్బతో సరిచేస్తారు. పార్లమెంటులో వర్గీకరణ చట్టాన్ని సాధించుకుంటారు.

కుల వ్యవస్థ దేశంలో అన్ని అసమానతలకు, సామాజిక అన్యాయాలకు కారణమైంది. దీని కారణంగా వేలాది షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనకబడిన వర్గాల వారికి దేశాభివృద్ధి నుంచి తిరిగి పొందటంలో తగిన ప్రవేశం, ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దేశ సంపద, విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో నేటికీ తగిన ప్రాతినిధ్యం, ప్రవేశం లేని రెల్లి, మాదిగ వంటి మరెన్నో దళిత కులాలకు, కోయ, చెంచు, యానాది వంటి ఇంకెన్నో ఆదివాసీ జాతులకు తగిన ప్రవేశం, ప్రాతినిధ్యం కల్పించడం ద్వారానే సృజనాత్మకత, వైవిధ్యాలతో మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. సామాజిక అన్యాయాలను, అసమానతలను సరిదిద్దవలసిన సామాజిక బాధ్యత పౌరులందరిది. అంతేకాదు, ఈ బాధ్యత సంస్థాగతమైనది, వ్యవస్థాగతమైనది, యాజమాన్యపరమైనది, ప్రభుత్వపరమైనది, సాటివారిపరమైనది.
(వ్యాస రచయిత, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు)

(భూమిక -మాసపత్రిక ఫిబ్రవరి 2007 సౌజన్యంతో)

MRPS welcomes Usha Mehra panel

HYDERABAD: The Madiga Reservation Porata Samiti led by Krupakar Madiga has appealed to Justice Usha Mehra to visit every district to critically examine living conditions of Madigas. In a statement here on Saturday, Mr. Krupakar welcomed the Mehra Commission and appealed to activists of the organisation to come to Hyderabad on July 15 and represent their problems. —Special Correspondent

Sunday, Jul 08, 2007,the hindu daily

Tuesday, March 11, 2008

వైద్యో! రోగులు బలి!



ఇదేం అన్నాయం జూడా సాములూ

ఎవురి మీరో మీరు సమ్మెజేత్తే

అస్పటల్ల మా వూపిర్లు గల్లో కలిసినయ్‌!

పోత్తిళ్ళ నుంచి పరలోకానికి నేరుగా పంపినరే!

మీ పంతాలకు మా పేణాలు అంతం కావాలా సాములూ?

మిమ్మల్ని తిడితే, తంతే మూడేళ్ల సిచ్చ పడాల!

డూటీలు ఎగ్గొడితే

రోగుల్ని ఇదిలిచ్చుకుంటే

అకాలంగా మీ సేతుల్లో పోతే

అందుకు ఏ సిచ్చలూ మీకు లేవా?

పెబుత్తాలూ, కోర్టులూ మిమ్మల్ని ఏం పీకలేవా?

ఇదేం సట్టం బాబులూ?

డెంగీ అతిసార, కలరాలు బస్తీలని కాటేసినపుడు

ఇసపుజెరాలు మన్యం జీవుల్ని మంటలో కలిసినపుడు

లంచం ఇస్తే కాని మంచం ఇవ్వమని సిబ్బంది తూస్కరించినపుడు

వసతుల కోసం పేదరోగులు కొట్లాడినపుడు

రోగాలకు వైదిగానికి అసెంబ్లీ లొ రచ్చజరిగినపుడు

మాసోమ్ముతో వైదిగం నేర్సుకున్న మీకుఏ బాజ్జెతా లేదా జూడాలూ

సచ్చి సాధిస్తున్నామనుకోకండి బాబులూ

మీకు భద్రత కావాలి నిజమేమా పేణాలకి వొద్దా సాములూ?

వైదిగం బందుజేత్తేనే ఇంతమందిమి పోతిమిఇంక ఆయుధాల అనుమతి మీకెందుకు జూడాలూ?

పోయిన మా నిండు పేణాలని సమ్మెలతో తిరిగితెత్తారా బాబులూ?

మీ అక్కుల మమ్మల్ని గావ ఇవ్వడం మానుకోండి దేవుళ్ళూ
(జూనియర్‌ డాక్టర్ల సమ్మెకాలంలో చనిపోయిన రోగులందరికీ)




Wednesday, March 5, 2008

బడుగులకు దక్కింది అడుగూ బొడుగూ...!

(బడ్జెట్ లో దళితులకు జరిగిన కేటాయింపుల గురించి కృపాకర్ మాదిగ, జూపాక సుభద్ర లు రాసిన ఈ వ్యాసం ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమైంది.)
అగ్రవర్ణాల ఇళ్ళలో జరిగే సామూహిక భోజనాల్లో అగ్రకులాలకు ముందు వడ్డిస్తారు. ఆహ్వానితులైనప్పటికీ దళితులు, సంచార, అర్థసంచార జాతులకు చివర్లో వడ్డిస్తారు. అప్పటికి పదార్ధాలన్నీ అడుగంటిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇలాగే అమర్యాదకరంగా ఉండటం దురదృష్టకరం. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ కథ ఎలా ఉందంటే, దేశంలో ఏ పల్లెటూరులోనైనా అగ్రవర్ణాల ఇళ్ళలో సామూహిక భోజనాలు జరిగినపుడు ఆహ్వానితుల్లో అగ్రకులాలకు ముందు వడ్డిస్తారు. ఆహ్వానితులైనప్పటికీ దళితులు, అర్థసంచార, సంచా ర జాతులకు చివర్లో వడ్డిస్తారు. అప్పటికి పదార్ధాలన్నీ అడుగంటిపోతా యి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇలాగే అమర్యాదకరంగా ఉండటం దురదృష్టకరం. ప్రభుత్వం పూర్తిగా ఎన్నికల బడ్జెట్‌ని ప్రవేశపె ట్టింది. శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల బడ్జెట్‌లకన్న, చాలా రాష్ట్రాల బడ్జెట్‌ల కన్న తమ బడ్జెట్ చాలా పెద్దదనీ, గత బడ్జెట్‌ల కన్న రెట్టింపు బడ్జెట్ అని ప్రభుత్వ పెద్దలు ఈ సందర్భంగా చెప్పుకు న్నారు. లక్షకోట్ల రూపాయల పైగా అంచనాతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ బడుగుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. అణగారిన సామాజిక వర్గాల వారికి జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు కావాలంటున్న దళిత ఫ్రజాసంఘాల డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. బడుగుల సంక్షేమానికి కొత్త బడ్జెట్‌లో తిరిపెం విదిల్చినట్టు నిధులు కేటాయించిం ది. బహుజనులు శంకించినట్టుగానే సాగునీరు, వ్యవసాయం, పారిశ్రా మిక మౌలిక సదుపాయాలకల్పన, పెద్దకంపెనీలు, ఇన్ఫర్మేషన్‌టెక్నాలజీ ప్రత్యేక ఆర్థికమండళ్ళ అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు భారీగా జరి పింది. తద్యారా అగ్రకుల బడాబాబులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఒక రూపాయి ప్రభుత్వం నడపడం కోసం, ఒక రూపాయి ప్రజల సంక్షేమం కోసం అనుకుంటే, లక్షకోట్ల రూపాయలు మించిన కొత్త బడ్జెట్ లో రాష్ట్ర జనాభాలో 18 శాతంగా ఉన్న దళితుల సంక్షేమానికి తొమ్మిది వేల కోట్లు కేటాయించాలి. అలాగే 7 శాతంగా ఉన్న ఆదివాసులకు 3,500 కోట్లు, 52 శాతంగా ఉన్న వెనుకబడిన తరగతులకు 26,000 కోట్లు, 12 శాతంగా ఉన్న మైనారిటీలకు 6,000 కోట్లు కేటాయించాలి. ఇలా చేసి సామాజిక న్యాయాన్ని చాటుకొని ఉంటే బాగుండేది. దానికి భిన్నంగా దళితులకు 1,293 కోట్లు, గిరజనులకు 440 కోట్లు, బిసిలకు 353 కోట్లు, మైనారిటీలకు 177 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 656 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దామాషా ప్రకారం న్యాయంగా కేటాయించాల్సిన వాటితో పోలిస్తే ఈ అంకెలు చాలా తక్కు వని అర్థమౌతుంది. అంతేకుకుండా బడ్జెట్‌లో కేటాయించిన వాటికన్నా చాలా తక్కువగా విడుదల చేస్తోంది. విడుదల చేసిన దాంట్లో కొంత దారిమళ్ళించగా, కొంత మిగులుగా చూపెడుతున్నది. చివరికి ఖర్చు పెడుతున్నది చాలా తక్కువైనపుడు, భారీ బడ్జెట్ అని ప్రభుత్వం చెప్పే దంతా పెద్ద మోసమని అర్థమౌతుంది. 90 శాతంగా ఉన్న ప్రజలకు 10 శాతాన్ని, 10 శాతంగా ఉన్న ధనికులకు 90 శాతాన్ని బడ్జెట్‌లో కేటా యించి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించింది. బడుగులను కొట్టి, బడా బాబులకు దోచిపెట్టే విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలి. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంఘం, ఆర్థిక-సామాజిక అధ్యయనా ల కేంద్రం ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఆరునె లల క్రితం రాష్ట్రంలో నెలకొన్న పేదరికంపై అధ్యయనం నిర్వహించాయి. గ్రామీణ ప్రాంతాల్లో 56.1 శాతం మంది పేదలున్నారని, వీరిలో 18.6 శాతం మంది కటిక పేదలన్న వాస్తవాన్ని అధ్యయనం తేల్చి చెప్పింది. అలాగే 80 శాతం మంది గ్రామీణులు నిర్ధారిత కేలరీల కంటే తక్కువ కేలరీలున్న ఆహారా న్ని తీసుకుంటున్నారనీ, పట్టణ ప్రాంతాల్లో సైతం 73 శాతం మంది పేదలు ఇలాంటి ఆహారలేమితోనే ఉన్నారన్న చేదు నిజాలను వివరంగా చెప్పింది. ఈ పరిస్థితుల్లోనైనా పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రాధాన్యతలతో కూడిన కేటాయింపులు జరపకపోవడం దారుణం. ఇప్పటికే 93,593 కోట్ల రుణ భారంలో రాష్ట్ర ప్రభుత్వం కూరుకుపోయిం ది. ప్రతి వ్యక్తిని సగటున 10,628 రూపాయలకు తాకట్టు పెట్టింది! అదే వైఖరిని ఇంకా కొనసాగిస్తోంది. గత బడ్జెట్‌లతో పోల్చినపుడు ఈ బడ్జెట్ లో ఎస్సీలకు 57 శాతం, గిరిజనులకు 39 శాతం, బిసిలకు 77 శాతం, మైనారిటీలకు 47 శాతం బడ్జెట్ పెంచినట్లు ఆర్థిక మంత్రి కాకిలెక్కలేసి చూపించారు. స్పెషల్ కాంపొనెంట్ ప్లాను కింద గత పదేళ్ళలో ప్రభుత్వాలు ఎస్సీల కు కేటాయించిన నిధుల్లో 13,000 కోట్ల రూనాయలను దారి మళ్ళిం చాయి. బకాయి పడ్డ నిధులను తిరిగి ఎస్సీలకోసం జమచేసే ఎటువంటి హామీ ఈ బడ్జెట్‌లో లేదు. ప్రత్యేక అంశ ప్రణాళిక కింద దళితుల సంక్షే మం కోసం ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించాల్సిన 8,000 కోట్లు పెద్ద మొత్తంగా కోతకు గురయ్యాయి. రెండు కోట్ల మంది ఎస్సీ, ఎస్టీల కోసం ఏర్పాటు చేస్తామన్న 'నోడల్ ఏజెన్సీ' ఏమైందో ప్రభుత్వం జాడ చెప్పదు. ప్రభుత్వ హాస్టళ్ళలో చదివే ఎస్సీ, ఎస్టీ, బిసి పేద విద్యార్థులు రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది ఉన్నారు. విద్యా సామాగ్రి, భోజనాలు, బట్ట లు, కాస్మటిక్స్ తదితరాలకు గాను ఒక్కొక్క విద్యార్థిపై రోజుకు సగటున 20 రూపాయల చొప్పునైనా ఉపకారవేతనాలను ఈ బడ్జెట్ కల్పించలేక పోయింది. పేద వర్గాల విద్యార్థినీ, విద్యార్థులంతా స్కూళ్ళు, హాస్టళ్ళు వదిలిపెట్టి బాల కార్మికులుగా మారే ఆర్థిక విధానాలను ప్రభుత్వం అను సరిస్తున్నదన్న అనుమానం కేటాయింపుల వాస్తవాలను గమనించిన ఎవ రికైనా కలుగక మానదు. వృత్తికులాల వారైన చర్మకారులు, రజకులు, వడ్డెరలు, నాయీబ్రా హ్మణ, చేపలుపట్టే మొదలగు సెక్షన్ల ప్రజల సంక్షేమాన్ని ఈ బడ్జెట్ విస్మ రించింది. సంచార, అర్థసంచార జీవనం సాగిస్తూ భిక్షుక వృత్తిలో జీవించే సమూహాల సంక్షేమాన్ని అలాగే అత్యంత వెనుకబడిన తరగతులు, విక లాంగులు, జోగినులు, సెక్స్‌వర్కర్లు, వలస కార్మికులు, పారిశ్రామిక కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఈ బడ్జెట్‌లొ నామమాత్రం చేసింది. భూమిలేని దళితులు, ఆదివాసులు, వెనుకబడిన తరగతుల భూ అవస రాలను తీర్చడానికి బడ్జెట్ దోహదం చేసేదిగా లేదు. పేదరైతుల భూము లు గుంజుకుని, ప్రభుత్వ భూములను కలిపి విదేశీ సంస్థలకు చౌకగా ప్రభుత్వం కట్టబెడుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇలా భూము లన్నిట్నీ ఉన్నవాళ్ళకే సమర్పిస్తూపోతే, రానున్న వందఏళ్ళలో ప్రజావస రాలకు ఏం చేస్తుందన్నది ఊహించడం సాధ్యంకావడంలేదు. దళిత వర్గా ల సంక్షేమాన్ని అర 'చేతి'లో వైకుంఠంగా చూపి, ధనికులను మరింత ధని కులుగా మారుస్తున్న ఈ బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తు ఓట్ల కోసమే ప్రవేశపెట్టిందనిపిస్తోంది. ఈ బడ్జెట్‌లో 'హస్త' లాఘవంతో కూడుకున్న అంకెల మాయ తప్ప వాస్తవాభివృద్ధి కన్పించదు. -జూపాక సుభద్ర, కృపాకర్‌మాదిగ