Sunday, June 9, 2013

రాజీ పడ్డ రాత ( జూపాక సుభద్ర కథ, నమస్తే తెలంగాణ ‘బతుకమ్మ’ లో ది: 9-6-2013)

 రాజీ పడ్డ రాత
babyఅది సింగరేణి కాలరీస్ ఏరియ. బాగ సలికాలం. యిక్కడ అన్ని కాలాలు తడాకా సూపిచ్చేటియే. ఎండలు, సలి, వానలు. పొద్దుగాపూవరిదో పొద్దటి బదిలి (డ్యూటి) వున్నట్టుంది బొగ్గు బకీట అంటిచ్చిండ్రు. బకీట్ల బొగ్గు మండుతుందని ముసలోల్లు, ఆల్లతోని పిల్లలు గూడ వురికచ్చి దాని సుట్టు జేరిండ్రు. సలికి దాని సుట్టుజేరి ముచ్చట్లు పెట్టుకుంటుండ్రు, నవ్వుతుండ్రు. ఆ సప్పుడిని కండ్లు దెరిసిన. దుప్పటి దీసి లేవబోయిన. పక్కన్నే పండుకున్న అక్క ‘‘ఏందే దీన్ని నా పక్కల ఎయ్యద్దంటే యేస్తరు. యిదేమొ వూకె పురుగు మెసిల్నట్టు మెసుల్తది’’ అని దుప్పటి నిండగప్పింది నాకు. బైట బకీట నెగడు తలుపు సందుల్నుంచి యింట్లక్కనబడ్తంది. బైటి ముచ్చట్లు యిన బడ్తన్నయిగాని స్పష్టంగా వినబడ్తలేవు. నవ్వులు మాత్రం బాగా వినబడ్తన్నయి. ఆ నవ్వులు నిద్రబోనిస్తలేవు సరితను.

పక్కన అక్క కదిలితే కాలుస్త అన్నట్లన్నది. ‘అక్కడి నవ్వులు ముచ్చట్లకన్న నా అక్కెర దీర్సెటోల్లు కనబడకపోతరా... యింటింటికి బోయే బదలు ఒకకాన్నే శానమంది దొర్కుతరు. యిండ్లల్లకు బోతే వాల్ల పెద్దోల్లు ఎందుకు, ఏమిటని ఓ కన్ను, సెవు యిటే పారేస్తరు. ఎందుకచ్చింది, యిక్కన్నే దొరికిచ్చుకుందాం’ అనుకున్న. ‘గుంపున్నది అక్కడ అక్క గునుగుడేమున్నత్తియ్ గవెప్పటికున్నయేనాయె గీమె ఆర్సేది గాదు, తీర్సేది గాదు. కాపోతే దొర్కరు. పొర్కల్ల వడ్తరన్నట్లె వుంటరు’ అనుకొని దిగ్గున లేసి తలుపుదీసి బైటి కురికొచ్చిన. బైట వాకిట్ల అగ్గి బకీట సుట్టుగుంపు కాడికొచ్చి ‘‘జరుగుండ్రి జరుగుండ్రి’’ అని ఆల్ల మధ్యన అదాటుగ యిరికి కూసున్న.
‘‘అరే, ఏందే ఏంబడి పోతందే లావు సలిబెడ్తన్నాదే’’ అన్నది ఆ గుంపుల ముసలమ్మ జెర సందిచ్చుకుంట.

‘‘పరీచ్చలాటగాదె పిల్ల, సదువుకోక గీడి కురికత్తన్నవు. పొద్దుగాల లేసి సద్వుకోవాపూగని గీ పోరగాండ్లందరు గీ ముసలోల్ల ముచ్చెట్లి నుడేందే’’ కుంటి తాత కప్పుకున్న సెద్దరి యింక దగ్గరికి జరుపుకుంటీ ‘‘మేమత్తె మీకేమడ్డమత్తన్నం. కొంచెం సేపు సలిగాగి పోతం తియ్యి’’ అని సాయం జేసే మొకాపూవరన్నా వున్నరాని ఒక్క సూపు సూసిందందర్ని అగ్గి బకెట సెగకు అరిసేతులు కాపుకుంట.
‘‘రాత్తిరి మీ యింట్ల ఏం లొల్లే సెరిసగం రాత్రిదాక లొల్లే’’ దుర్గి పెద్దమ్మడిగింది నన్ను. ‘‘ఏమో నేను గా లొల్లంతిండ్లే. నిదురబొయిన’’ అన్న బకిట్ల పుల్ల బెడుతూ...
‘‘గంత లొల్లయినా సోయిలేదే నీకు? గట్టెట్ల నిద్రవడ్తదే... నిదుర పాడుగాను, కన్ను బొడ్సుకున్నా గింత నిదురరాదు. కోడికి నాకు తెల్లారలె....’’ అగ్గి బకెట కాడ గూసున్న మల్లమ్మ ముసల్ది గునిగింది.
‘‘పసి పోరగాండ్లు ముసలోల్ల మొక దుర్గి పెద్దవ్వ. యింతల మా దోస్తు లీల వురికచ్చి నిల్చున్నది.
‘‘ఆ... అచ్చినవా రారా... అగో మీ దోస్తు ఆడ కూసున్నది’’ ఆ గుంపుల్నుంచి వొకరు సెప్పంగనే లీల నా పక్కకొచ్చి యిరికింది.

‘‘యిప్పుడే లేసినవా’’ అన్న పొక్కల పుల్ల బెడుతూ., మండేటప్పుడు బైటికి తీస్తూ. అగ్గి బకీటు పొక్కల పుల్లబెట్టి మండేటప్పుడు బైటికి దీసి ఆ మంటను చూసి సంబరపడి సల్లారినంక మల్లా ఆ పుల్లను బకీటు పొక్కల బెట్టడం, తీయడం, యిదో ఆట మాకు....
‘‘లేదు యిల్లూడ్సి బాసాండ్లు బైటేస్తుంటె మీ లొల్లి యినవడి సేతులు కాపుకుందామని వచ్చిన’’ అని చేతులు కాపుకుంటూ అన్నది.
‘‘రాత్రి టీవీల సీరియల్ సూసినవా’’ అడిగింది కుతూహలంగ లీల.
‘‘ఏమో నేం జూల్లే’’ అన్నాను నిర్లిప్తంగ.
‘‘గీల్లకు ఏమైన సీన్మ ముచ్చెట్లు, టీవీల ముచ్చెట్లే కావాలె దుర్గి పెద్దవ్వ. రాన్రాను లోకం బట్టెబాజిదయితంది. గా టీవి ఎప్పుడన్న ఉప్పుస కోసం సూద్దామంటే రోతత్తది. ఆల్లు ఎక్కడోల్లో ఏమో మన మాటగాదు, మన లెక్కగాదు, మన బట్టబాతలె వుండయి. ఎక్కడి మనుసులో ఏందో....’’ అని ఎల్కటి తాత అనంగనే సుట్టు కూసున్న పిల్లలు బాగ నవ్విచ్చిండ్రు. ‘‘కాలం గిట్ల మారవట్టె మనమేం జేత్తమే మామా! లెల్లోల్లం గాదు, తప్పెటోల్లం గాదు. గీల్లకన్ని నవ్వులాటలే, పిల్ల సేట్టలు’’ అన్నది నర్సవ్వ కొంగునిండ గప్పుకుంట...
నేను గీ ముచ్చ నాకు ఎవరు సాయంజేత్తరో అని కూసున్నోల్ల గుంపుజూసిన. రవి, రమేష్, లీల, సరిత, శ్రీను వున్నరు. ఎవల మాటలు వాల్లు మాట్లాడుకుంటాంటె మెల్లగ వొక్కొక్కరి దగ్గెరికి బోయి ‘‘నీకు రెండు పెన్నులున్నయా’’ అని అడిగిన గుసగుసగా. వాల్లు గూడ అదే గుసుగుసతో ‘‘లెవ్వంటె లెవ్వన్నరు’’ నాగుండె డక్కుమన్నది. అంత సలిల గూడ నా వొల్లంత కాకెక్కింది.


ఏం జెయ్యాలె, మా యింట్ల పన్నెండు మందిల నేనే సిన్నదాన్ని. లేకలేక సదివిస్తుండ్రు. 6వ తరగతి సద్వుతున్న. ఓ దిక్కు అవ్వయ్య గావురం, యింకో దిక్కు అన్నలు, వదినెలు, అక్కలు ‘బాగ సదువాలె, కిలాసుల ఫస్టు రావాలె. లేకుంటే బొక్క లిరుగుతయి’ అనేటోల్లు. గీల్లందరి కండ్లల్ల పడి వుండేది. గీల్లందరు నా మీద చాన స్ట్రిక్టు. గా బెస్తోల్ల రజిత ఎట్ల సదువుతది. గా సాకలోల్ల పిల్ల ఎంత మంచిగ వుషారుగుంటదని వాల్లకు నచ్చినోల్ల బుద్దులన్ని నా మీద రుద్దెటోల్లు. ఏం గొనిచ్చినా వాల్లకు యాదొచ్చినప్పుడు తిరిగి ఆల్లకు మల్ల సూపియ్యాపూనని అడిగెటోల్లు. స్కూల్లు మొదలైనప్పుడే నాలుగు స్కూలు యూనిఫాములు, ఒక బ్యాగు, పుస్తకాలు సరిపోయే నోట్‌బుక్స్, టెక్ట్స్‌బుక్స్, రెండు పెన్నులు, నాలుగు పెన్సిల్లు, రెండు జతల చెప్పులు, మూడు జతల రిబ్బండ్లు యాడాదికని లెక్క జెప్పి తెచ్చేది. ‘పంటన్న యాడాదికి రెండుసార్లింటి కొస్తది. నాకేమో యాడాదికి వొక్కసారే. ఒక్కసారే దిక్కుమొకం లేకుంట గొని పారేసి మల్లా యాడాద్దాక గది లేదు, గిది లేదని’ అడుగొద్దు. గిదీ నా సౌలతు.

తెచ్చినప్పుడు చాన సంబురపడేది. మా క్లాసోల్లు దోస్తులు కూడా ‘‘అబ్బా వొక్కసారే అన్ని కొనిబెడ్తరు మీ వోల్లు మంచోల్లు, గొప్పోల్లు’’ అని మొకాలు పెద్దగ జేసేటోల్లు. నేనో పెద్ద ఫుడింగ్‌లాగ పొంగిపోయేది. ఒక్కసారి గవన్ని ఒక్కకాడ చూసుడు మంచిగనే వుండేది. కని వాటిని యాడాదంత దాసుకునుడు, కాపాడుకునుడు వశంగాక పోయేది. యింట్ల, క్లాసుల దొంగ దొర కొట్టకుంట సూసుకొవాలె. దాని కోసం యింట్ల అక్క పిల్లల, అన్న పిల్లల కన్నుబడని జాగల దాసుకునేది. పెన్ను పెన్సిల్లను గోడ సూర్ల, బియ్యం బస్తాలల్ల, దుర్గమ్మ తొట్టెల, బోనం కుండల్ల దాసుకునేది. పాత బట్టలు, సినిగిన బట్టలతోని మూటగట్టిన మెత్తల్ని యిప్పి అండ్ల కొన్ని, అండ్లకొన్ని నోటు పుస్తకాలు పెట్టి మల్లా ఎప్పట్లాగె కట్టి ముడేస్తుంటిని. యిన్ని జేసినా గూడ పోతనే వుండేయి.

మెత్తల సీమలున్నయని యిప్పినప్పుడు నోట్సులుంటే అవ్వి తీసి బైటేసుడు. బోనం కుండల్ల దాసుకున్నయి గూడ పండుగలప్పుడు బైటేసి ఏడ బడ్తె ఆడ బెట్టడం వల్ల నోట్సులు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు, రబ్బర్లు పోయేవి. యిక క్లాసుల కూడ బాగ దొంగతనాలు జరిగేయి. ఇది వరకు ఒకటి బోయి ఒకటన్న వుండేది. ఈసారి ఆర్నెల్ల పరిక్షలకే కొనిచ్చిన మూడు పెన్సిల్లు, రెండు పెన్నులు పోయినయి. మైసమ్మ మాయం జేసినట్టు బోయే నా వస్తువుల్ని ఎట్ల గాపాడుకోవాల్నో తెలువకపోయేది. ఆర్నెల్ల పరీక్షలు యింకా రెండ్రోజులే వున్నయి. ‘పరీక్షలు ఎట్లా రాయాలె? ఏం జేయాలే దేవుడా గీ పెన్ను ఎక్కన్నుంచన్న పుట్టియ్యి దేవుడా’ అని బుక్కుల్ల దేవుని బొమ్మల పేజీల నెమలీకలు బెట్టి మొక్కుకునేది.

పరీక్ష రాయనీకి అందరికి పెన్నులు కావాలె. ఎవరిత్తరు? ఎవరికన్నా రెండు పన్నులుంటె బాగుండు. ఎవరికున్నయని పేరు పేరునా తీసిన. యింక ఒక్క పెన్సిలు మిగిలింది. యిది యింట్ల దెలిస్తే నా తెలివి తక్కువతోని బోయినయని గింత సోయి లేదని కొట్లు, తిట్లు. అవి పడుడు నా వశం గాదు. పోనీ వీల్లు సద్వుకున్నోల్లు గూడ కాదు. సద్వితే వీళ్ళ దగ్గెర పెన్నులుండెయి. దొంగతనంగానైనా కొట్టేద్దును. ఆల్లకు అంత సీను గూడ లేకపాయె. ఎట్ల ఏం జెయ్యాలనని క్లాసుల శ్రీను, రవి, జమున, యాదమ్మల దగ్గర రెండ్రెండు పెన్నులుండంగ చాన సార్లు జూసిన. మిగతోల్ల దగ్గర ఒక్కొక్క పెన్నే వుండేది.
రవి, జమున, శ్రీను వాల్లిండ్లు దూరం మా యింటికి. యాదమ్మ యిల్లు మా యింటెన్కనే. పోయి అడుగుదాము. యీమే యియ్యకుంటె వాల్ల దగ్గెరికి పోవచ్చని నిర్ణయించుకొని యింట్ల ‘మా క్లాసామె యాదమ్మింటికి పోతన్న’ అని చెప్పి పోయిన. పోయె వరకు యాదమ్మ గిన్నెలు తోముతంది కూసోని. నన్ను జూసి ‘‘ఏంది సద్వుడయిందా? నీకేంది నువ్వు క్లాసుల ఫస్టాయె.

నీకు పరీక్షలప్పుడే సద్వాలనేమున్నది’’ అన్నది పీసుతోని బూడిద్దిసుకుంట. వాల్లమ్మ యింట్లున్నది. నేనటిటు జూసి యాదమ్మ దగ్గెరికి బోయి వట్టిగనే కాల్లమీన కూసున్న. గిన్నెల్ని దగ్గెరికి జరుపబోయిన. యింకా ఆమెను మెహర్బాని సెయ్యనీకి ఆమె తోమినయి కడగబోయిన. ‘‘వద్దు, మామ్మ జూస్తే గిన్నెలు ముట్టుడైనయని మల్లా తోమ్మంటది. దూరమే కూచో అన్నది. క్లాసుల నేనెట్ల చెప్తె అట్ల వినే యాదమ్మ, బైట నేను కొరికిన జాంకాయ తినే యాదమ్మ, వాల్లింటికాడ నన్ను దూరముండనుడు కార్జం కలుక్కుమన్నది. అయినా, ‘‘ను సదువుతున్నవ్? అన్ని నేర్చుకున్నవా?’’ అన్న మామూలుగ.
‘‘నాకు సద్వుడే అయితలేదు. సుట్టాలచ్చి పనెక్కువైంది. యింకా వూడ్సుడు, తోముడు, కడుగుడు, అలుకు పూతలు. గింత తీర్తలేదు యింట్ల’’ అన్నది యాదమ్మ.
యిగ యాదమ్మ వాల్ల నాయిన సద్వుకున్నడు. బాయిల పనైనా మీది పనే జేత్తడు. జేబుకు పెన్ను వెట్టుకొని తిరుగుతడు. ఆమెకు యిద్దరన్నలు. పదో తరగతి, ఇంటరు సదువుతుండ్రు. వాల్లు సదివిన, రాసిన నోట్సులు, పెన్నులు, బుక్కులు అన్నీ యాదమ్మకే. యాదమ్మకు ఈ పని పాటలే యిష్టం. సదువు పెద్దగ పట్టించుకొనేది గాదు. ఒక్కతే బిడ్డని పావురం.

‘‘ఏదో పేపరు తెల్సేవరకన్న సదివితే సాలు. ఆడపిల్లకు సదు పనిమంతురాలు కావాలె. రేపు ఎవనికన్న యిత్తే ‘నీయమ్మ నీకేం పని నేర్పిందే’ అని నన్ను దిడ్తరు అని వాల్లమ్మ అమ్మలక్కలతోని అంటుంటది.
యిట్లాంటియన్ని యిని యాదమ్మ ఏదో టైంపాస్ కన్నట్లు క్లాసుకొచ్చేది. చాన డాబు గొచ్చేది. సేతులనిండ గాజులు, తలనిండ పూలు, మెడగ్గొలుసు, కాల్లకు పట్టగొలుసులు, మంచి బట్టలేసుకొని వచ్చేది. బ్యాగునిండ పుస్తకాలు, ఒక బాక్సునిండ పెన్నులు, పెన్సిల్లు, రబ్బర్లు నింపుకొని వచ్చేది. అవన్ని జూసి మా సారు ‘‘బ్యాగునిండా పుస్తకాలు, బాక్సు నిండా పెన్నులు గాదు. తలనిండా అక్షరాలుండాలె’’ అనేటోడు. మొత్తానికి క్లాసంతా యాదమ్మను ‘సుద్దమొద్దు’ అని సాటుకు అనుకునేటోల్లు. కాని, యాదమ్మకు రాసిన నోట్సు యిచ్చి ఆడిపిచ్చుకునేది క్లాసుల నేనొక్కదాన్నే.

మెల్లగ ఆ స్నేహంతోనే ‘‘యాదమ్మా నా పెన్నులు పోయినయి...’’ అన్న మొకం దీనంగ బెట్టి.
‘‘పోయినయా కొనుక్కో. ఎల్లుండి నుంచే గద పరీక్ష’’ అన్నది కడిగిన గిన్నెలు తీస్కుంటా...
‘‘పోయినయని చెప్తె యిండ్ల కొడ్తరు గద. యాదమ్మా నీకు తెల్సుగద మా అన్నపూట్లాంటోల్లో...’’
‘‘మరేం జేత్తవు’’ యాదమ్మ అయోమయంగ...
‘‘నీ దగ్గర చాన పెన్నులుంటయి గద, నాకొక పెన్నియ్యవా... మంచిగ పడేది’’ అన్న బెంగగా...
‘‘నా దగ్గెర మా అన్నలయి, నాయినయి పెన్నులు చాన్నే వున్నయి గనీ అన్ని మంచిగ పడయి’’ యాదమ్మ గిన్నెల్ని అరుగుమీద బోర్లిస్తూ...
‘‘రెండు మూడన్నా మంచిగ పడవా’’ అన్న అరుగుమీన కూసుంటూ. ‘‘పూర్తిగా కాదు. పరీక్షలయి పోంగనే యిస్త’’ అన్న కొంచెం జాలిగ..
‘‘వుత్తగనే యియ్యాల్నా’’ యాదమ్మ నా కండ్లల్లకు జూస్తూ...
‘‘మల్లిత్త గద, నీకే’’ అన్నాను. నేనుగూడ అట్లనే జూస్తూ...
‘‘రాసినంక యిత్తవు. రాసేటప్పుడేమిత్తవు’’ యాదమ్మంది కండ్లు కిందికేసి...
‘‘ఏమియ్యాలె? పెన్నిచ్చి నా పరీక్షల గండం గట్టెక్కిస్తే ఏమియ్యమన్నా యిస్త’’ అన్న.
‘‘ఏం లేదు. పరీక్ష రాసేటప్పుడు నువ్వు రాసేది నాకు సూపియ్యాలె’’ అన్నది.
‘‘ఓ దాందేమున్నది, పేపరు మొత్తం నీ ముందట బెడ్త తియి’’ అని ఒప్పుకున్న.
పెన్ను పోయిన బాదముందు, టెన్షన్ ముందు యింట్ల చెప్పుకోలేని మాట ముందు గీ పరీక్ష పేపరు సూపిచ్చుడు ఒక లెక్కా. అందులో యాదమ్మ మా యింటికి రాదు. వచ్చినా చెప్పదని గ్యారంటీ. నాలాగ అందరిండ్లకు బోదు. వాల్లోల్లు యింట్లకాలు బైట వెట్టనివ్వరు. చలో ఏదయితే అదయింది. పెన్ను దారి దొరికింది. యీడికింతే నేను బంగారు కొండననుకున్న. ‘‘యిస్తవా యిప్పుడు’’ అడిగిన వెంటనే, ఓ దిగులు తీరిందని ఆనందంతోని. యాదమ్మ మొకంగూడ ఏదో దిగులు దించుకున్నట్టున్నది. ‘‘మా అమ్మ యింట్లున్నదే. ఆమె లేనప్పుడు యిస్త’’ అని చెప్తే ఏ అనుమానం లేక యింటికి బోయిన. తెల్లారి వాల్లమ్మ లేంది జూసి పోయి పెన్ను తెచ్చుకున్న.

ఎర్ర మూత పెన్ను చాలాబాగుంది. మంచిగ పార్తంది. పెన్నుపోయినప్పట్నించి బాగ దిగులుండె. యాదమ్మ దయవల్ల యింట్ల పెన్ను సంగతి తెల్వకుంటయింది. యింకోటి పరీక్షలు ఎట్ల రాసి గట్టెక్కాలనే టెన్షన్ బోయింది. పరీక్షలైపోయినంక ఏ సంగతైన తర్వాత జూడొచ్చు. యిప్పుడైతే గీ ఆపతి తీరింది. అని హాయిగ ముర్సుకుంటు పరీక్షలకు సదువుకున్న. జవాబులు గూడ యాది మరుపులేకుండా కండ్లల్ల మెరుస్తున్నయి.
మొదటి రోజు తెలుగు. సార్ తెల్ల పేపరు, కొచ్చెన్ పేపరిచ్చిండు. నా యెన్క యాదమ్మ కూసున్నది. నా చేతిల పెన్ను వైపు యాదమ్మ చూస్తుంది. నాకర్థమైంది ఆ చూపుకుండే అర్థం. ‘నువ్వు జెప్పినట్టే జేస్త’ అని ఒక్క నవ్వు నవ్విన యాదమ్మను జూసి.

పెన్ను నా కన్న ముందే వుర్కుతంది తెల్సిన ప్రశ్నలొచ్చినయని. అట్లా తెలుగు, ఇంగ్లీషు పరీక్షలు నేను రాసిందంతా ఎక్కించింది యాదమ్మ. ‘అదృష్టవంతురాలు ఏం జద్వకుంటనే రాసి మార్కులు దెచ్చుకుంటుందే పెన్ను పుణ్యమా’ అని అనుకున్న. ఇంగ్లీషు, హిందీ పద్యాలు, ఆన్సర్స్, గ్రామర్ అంతా బట్టి పట్టేది. అంత బట్టి పట్టి ముక్కున వుంచుకున్న నరాలబాధ, ఎవరికి చెప్పుకోలేని సదువు కోత... చాలా అవస్థనిపించింది. కడుపు నిండా తింటే నిద్రొస్తదని కడుపు సంపుకొని కొంచెమే తిని నిద్రగాసి అర్థం గాని దాన్ని బలవంతంగా మెదట్ల ముండ్లను నాటినట్లు నాటిన. పరీక్షలప్పుడు పీకేసేటియే కదాని. (పేపరు తెలుగే కానీ మేమ్మాట్లాడే తెలుగే గాదాయె...)

యిట్ల సద్వు సద్వుకొని రాస్తే... ‘యాదమ్మ మాత్రం సద్వుకోకుంట మంచిగ తిని, నిద్రబోయి నీట్‌గ తయారై బొట్టు బోనం దిద్దుకొనొచ్చి మొత్తం నా పేపరంత కాపి కొడ్తంది’ అని తిట్టుకున్న. నేను చేసిన లెక్కలన్ని ఎక్కిస్తుంది వెనుకనుంచి. నాకు చాలా జెలసి, కోపమొచ్చిందో పెన్ను ఒప్పందం మర్సిపోయిన. రాసే పేపరు మీద యింకో పేపరు పెట్టి కనిపించకుండా రాస్తున్నా..
‘‘పేపరు తియి’’ మామూలు గన్నది యాదమ్మ.

నేను పట్టించుకోనట్లుగా రాస్తున్నాను అట్లనే...
‘‘నా పెన్నియ్యబ్బ’’ అంది కొంచెం గట్టిగ...
ఆ మాటకు నా దిమ్మ దిరిగింది. ‘‘పెన్నిస్తే ఏం రాస్తా?’’ అని అడ్డు పేపరు తీసేసిన అసహాయంగా....
- జూపాక సుభద్ర,
98499 05687